//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఇద్దరు ప్రపంచాన్నే భయపెట్టారు..!

Category : world

2017 వ సంవత్సరంలో ప్రపంచం మొత్తాన్ని భయ పెట్టిన విషయం ఏమయినా ఉందా...? అసలు ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం ఏమయినా ఉందా..? అవును.. ఉంది. అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్పర్ధలు.. డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం అదే పని చేశాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి....ప్రపంచాన్ని భయపెట్టాయి. ఈ ఏడాది జనవరిలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనొచ్చాకే ఈ గొడవలు పెరిగాయి. ట్రంప్...కిమ్ ... ఇద్దరూ మొండి ఘటాలే. ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ఫలితం ఏమిటి...? ఎన్నడూ లేనిది 2017 ఒక్క సంవత్సరం లోనే ఉత్తర కొరియా 15 పరీక్షలు జరిపింది. అవి అణు పరీక్షలు కావచ్చు....క్షిపణి పరీక్షలు కావచ్చు. ఇక యుద్ధం తప్పదా అని ప్రపంచం భయపడింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక పిచ్చోడని ట్రంప్ ఎగతాళి చేశారు. ట్రంప్ ముసలాడని కిమ్ తూలనాడారు. కిమ్ పొట్టివాడని నేనెప్పుడైనా అన్నానా...నన్ను ముసలి వాడని ఎందుకన్నాడు...అంటూ ట్రంప్ రుసరుసలాడారు. ఈ మాటల యుద్ధం అక్కడితో ఆగలేదు. ఉత్తర కొరియాను బాంబులతో తుడిచిపెట్టేస్తానన్నారు ట్రంప్. అణ్వయుధాలతో షికాగో నగరాన్ని నేలమట్టం చేస్తానన్నారు కిమ్. అంతే...! కొరియా పొరుగునున్న అమెరికా మిత్ర దేశాలు జపాన్, దక్షిణ కొరియా గడగడలాడాయి. జపాన్ భూభాగం మీదినుంచి క్షిపణి దూసుకెళ్లేవిధంగా కిమ్ పరీక్ష జరిపారు. జపాన్‌లో సైరెన్లు మోగాయి. జనం భయభ్రాంతులతో పరుగులుతీసి దాక్కున్నారు. ఇదంతా చూస్తున్న ప్రపంచం అణు యుద్ధం తప్పేట్లు లేదని భయపడింది.

ఆగస్టు 2017... ఆ నెలాఖరున ఉత్తరకొరియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా జపాన్ భూభాగం మీద నుంచి బాలిస్టిక్ మిసైల్ పరీక్షను జరిపింది. గురుత్వాకర్షణకు లోబడి లక్ష్యాన్ని చేధించగల క్షిపణి పరీక్ష. ఇలాంటి క్షిపణులే అణుబాంబును మోపుకువెళతాయి. ఈ పరీక్ష జరిపిన ఉత్తర కొరియా.. ‘‘ఖబడ్దార్ నా జోలికి వస్తే అమెరికాపై అణుబాంబులు వేస్తా, చికాగోని నేలమట్టం చేస్తా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను తుడిచిపెట్టేస్తా’’ అని కిమ్ అమెరికాను హెచ్చరించారు. దీనిపై ట్రంప్ స్పందన మరింత ఘాటుగా ఉంది. సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్యసమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగం అదే చెప్పాంది. అమెరికాకు చాలా సహనం ఉందని, అమెరికాను, తమ మిత్ర దేశాలను రక్షించుకోడానికి ఎంత దూరమైనా వెళతామని, ఉత్తరకొరియాను పూర్తిగా నాశనం చేయడం తప్ప వేరే దారిలేదని అన్నారు.

ఐక్యరాజ్య సమితిలో పలువురు దేశాధినేతలు అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతలను వారించారు. ఎందకంటే ఒకరు పెద్దన్న, రెండోవారు పెద్దన్నను ఎదిరించి నిలవాలనుకుంటున్న కుర్రవాడు. అందుకే ఎంతకైనా సిద్ధమంటున్నాడు. ఇదే ప్రపంచాన్ని భయపెట్టింది. ప్రపంచంకన్నా ముందు దక్షిణ కొరియా, జపాన్‌లు మరింతగా భయపడుతున్నాయి. యుద్ధోన్మాదం వద్దంటూ ట్రంప్‌ను కోరుతూ దక్షిణ కొరియాలో ప్రజలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ట్రంప్, కిమ్ మాటల యుద్ధం ప్రపంచాన్ని అణు యుద్ధం అంచుల వరకు తీసుకువెళ్లింది.

అణుయుద్ధం గురించి ప్రపంచం బయపడిందీ అంటే...అందుకు మరో కారణం కూడా ఉంది. ఎన్నడూ లేనంతగా ... ఎవ్వరూ చేయని విధంగా 2017 ఒక్క సంవత్సరంలో ఉత్తర కొరియా ఏకంగా 15 పరీక్షలు జరిపింది. అందులో కొన్ని ఖండాంతర క్షిపణులు, కొన్ని బ్యాలిస్టిక్ క్షిపణులు,మరి కొన్ని అణుపరీక్షలు ఇదే ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేసింది. ఉత్తర కొరియా అధినేత ఎందుకిలా రెచ్చిపోతున్నాడు... అంటే అందుకు కారణం లేకపోలేదు. చైనా ఎంత చెప్పినా వినకుండా దక్షిణ కొరియా... జపాన్ దేశాలతో కలిసి అమెరికా మిలిటరీ ఎక్సర్‌సైజులు.... అంటే సైనిక విన్యాసాలు చేపట్టింది. అమెరికా యుద్ధ నౌకలు... యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇదే కిమ్‌ను రెచ్చగొట్టింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య యుద్ధమే వస్తే అది ప్రపంచ యుద్ధం అవుతుందని చాలా మంది జోస్యం చెప్పారు. అదే నిజమైతే చైనా, రష్యా ఉత్తర కొరియా వైపు నిలుస్తాయని కూడా అన్నారు. అందుకే ప్రపంచ దేశాలు భయపడ్డాయి.