ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక దగ్గర కలుసుకుంటే ఎలా ఉంటుంది? అవును.. ఉత్తర కొరియాలో జరుగుతోన్న శీతాకాల ఒలింపిక్స్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా స్టేడియంలోని ప్రజల మధ్య కలియ తిరిగారు. అయితే వారిద్దరూ నిజంగా కిమ్, ట్రంప్‌లు కాదులెండి.
అచ్చం వారిని పోలి ఉండే మరో ఇద్దరు వ్యక్తులు. ఆస్ట్రేలియాకు చెందిన హోవార్డ్ ఎక్స్ అనే వ్యక్తి కిమ్ జోంగ్ మాదిరిగా జట్టు కత్తిరించుకొని రాగా, అమెరికాకు చెందిన డెన్నిస్ అలన్ అనే వ్యక్తి ట్రంప్ లాగా పొడవాటి ఎర్ర టై ధరించి స్టేడియానికి వచ్చారు. వారిని చూసి మీడియా వ్యక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అంతా ఎగబడడంతో భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.
నిత్యం అణు బాంబు హెచ్చరికలతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతలా ఉంది పరిస్థితి. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఇలా కనిపించడంతో స్టేడియంలో ఉన్నవారంతా తమ ఫోన్లకు పనిచెప్పి ఫొటోలు, వీడియోలు తియ్యనారంభించారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా పోటీ పడడంతో గందరగోళం ఏర్పడింది.
అయితే ఈ సంఘటనపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ఉత్తర కొరియాకు చెందిన భద్రతా సిబ్బంది, వారిని మీడియా ప్రతినిధులకు దూరంగా కూర్చోబెట్టారు. ‘‘చాలా మంది జర్నలిస్టులు తమ వెంట పడగా భద్రతా సిబ్బంది తమను తీసుకొచ్చి సీట్లలో కూర్చోబెట్టారు’’ కిమ్ రూపంలో ఉన్న వ్యక్తి స్పష్టం చేశాడు.