విదేశీయులు తమ దేశంలోకి రాకుండా నియంత్రించేందుకు వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్. అమెరికా తీసుకున్న నిర్ణయం భారత్ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అమెరికా వ్యాపార సంస్థలయిన ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆ విషయం అమెరికా గుర్తించాలిసిన అవసరం ఉందన్నారు. ఈ సంస్థలకు భారత్ గుడ్ బై చెబితే పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకోవాలని ఆయన హెచ్చరించారు. భారత్‌లో సొంతంగా రూపొందించిన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయని అలాంటప్పుడు అమెరికాలో రూపొందించిన ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ యాప్స్‌ను భారత్ ఎందుకు ఉపయోగించాలని మిట్టల్ ప్రశ్నించారు. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 20 కోట్ల మంది యూజర్లు, వాట్సాప్‌కు 15 కోట్ల మంది,గూగుల్‌కు 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారని సునీల్ మిట్టల్ గుర్తు చేశారు.ఇలా అమెరికా కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించి చాలా లాభాలు ఆర్జిస్తున్నాయని మరి అలాంటప్పుడు అమెరికాలో భారతీయుల రాక పై ఆంక్షలు విధించటం సబబు కాదని అభిప్రాయపడ్డారు.