//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చదువుకి దారి లేదు బతుకు దారి కన రాదు ....

Category : editorial

ఇది జోగిని సంతతి శాపం

జోగిని పిల్లలు... అందరిలా వాళ్లకూ చదువుకోవాలని ఉంది. కష్టాన్ని ఎదిరించే తెగువుంది. కానీ నిన్నమొన్నటి వరకు బడిబాటే ఎరగరు. కారణం వారికి తండ్రెవరో తెలియకపోవడమే. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలతో కాస్త వెసులుబాటు వచ్చినా తోటి విద్యార్థుల మాటలు ఆ పసి హృదయాలను గాయపరిచాయి. దాంతో స్కూల్‌కి వెళ్లడమే మానేసి మరింత పేదరికంలోకి జారిపోతున్నారు.దేవుడి పేరుతో, ఆచారం సాకుతో ఆడపిల్లల జీవితాలను నరకప్రాయం చేస్తున్న జోగిని వ్యవస్థ ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతోంది.జోగినిలు మాత్రమే కాదు.. వారి పిల్లలూ నిత్య నరకం అనుభవిస్తున్నారు. వారికి తండ్రి ఎవరో తెలియదు. ఎవరికి పుట్టారో తెలియదు. తల్లిని అడిగినా ఆమె వద్ద కన్నీరు తప్ప ఎలాంటి సమాధానమూ ఉండదు. ఎందుకంటే జోగినిలు పెళ్లి చేసుకోరు. కానీ ఎవరు పిలిస్తే వారి దగ్గరకి వెళ్లాల్సిందే.

'నీ తండ్రి ఎవరు' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక, నలుగురిలో కలవలేక, జోగినిల పిల్లలు గుమ్మందాటే వాళ్లే కాదు. అలాంటి పరిస్థితిలో బడికెళ్లి ఓనమాలు దిద్దడం వారికెలా సాధ్యం.! అందుకే 2009కి ముందు జోగినిల పిల్లలు స్కూల్‌కి వెళ్లింది లేదు. బడిగంట విన్నది లేదు.ఒకవేళ ఆనాడు ఎవరైనా ధైర్యం చేసి స్కూల్‌కి వెళ్లినా చట్టాలు, నిబంధనలు వారికి అడ్డుపడేవి. గతంలో పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే తండ్రి పేరు కచ్చితంగా ఉండాలి. తండ్రెవరో తెలియని జోగిని పిల్లలకు తండ్రి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తోటి పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉన్నా పసివాళ్లు స్కూల్ గేటు బయటే ఆగిపోయేవాళ్లు.జోగిని పిల్లల పరిస్థితి చూసి స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపట్టాయి. ఊరూరా తిరిగి అవగాహన కల్పించాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగటంతో 2009లో అప్పటి ప్రభుత్వం తండ్రిపేరుకు బదులుగా తల్లిపేరును రాసేందుకు వీలు కల్పించింది.'సమస్య కొంతతీరినా సమాజం నుంచి అవమానాలు, ఛీత్కారాలు తప్పలేదు. 'ఎవరికి పుట్టారో తెలియదు' అంటూ తోటిపిల్లలు వారిని గేలి చేసేవాళ్లు. చదువులో, ఆటపాటల్లో అంటరానివారిగా చూసేవాళ్లు', అంటుంది రేవతి అనే ఓ జోగిని కుమార్తె.కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిగ్గుతో తల దించుకోవాల్సిన దుస్థితి తనదని బాలమ్మ అనే జోగిని కన్నీరుమున్నీరవుతోంది. ఆచారం పేరుతో పెద్దలు చిన్నప్పుడే తనకు పెద్దశిక్ష వేశారని ఆమె బోరుమంటోంది.బాలకృష్ణమ్మ అనే జోగినికి మంగమ్మ అనే పదిహేడేళ్ల కూతురుంది. తాము పడిన బాధలు కూతురు పడకూడదనే ఉద్దేశంతో ఆమెను ఇంటర్ వరకు చదివించింది. ఇంకా చదువుకోవాలని ఆమెకున్నా.. పేదరికం ముందు ఓడిపోయి కూలిపని చేస్తోంది.మరో జోగిని ఎల్లమ్మ కూలీ పని చేసుకుని బతుకుతోంది. 4వ తరగతి చదువుతున్న ఆమె కొడుకు కార్తిక్ చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు.ఏ జోగిని కుటుంబాన్ని కదిలించినా ఇలాంటి కన్నీటి కథలే కనిపిస్తాయి. అవమానాలు భరించలేక చదువులకు స్వస్తి చెప్పిన వారు చాలామంది ఉన్నారు.

Related News