//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపియల్ లో ఒక్కో పరుగు విలువ తెలుసా

Category : sports

ఐపియల్ అనగానే మనకు క్రికెట్ కంటే ముందు ఆ లీగ్ లో ఖర్చు చేసే డబ్బే గుర్తుకు వస్తుంది. స్టార్ ఆటగాళ్ళ కోసం ఖర్చు చెయ్యడానికి ఎంతైనా సరే లెక్క చెయ్యరు యజమానులు. అయితే వారు ఎంత వరకు న్యాయం చేసారు. అసలు ఒక్కో పరుగుకి వారు ఎంత తీసుకున్నారో ఒక్కసారి చూద్దాం.

రోహిత్‌ శర్మ.. ముంబై ఇండియన్స్‌

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 14 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 286 పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌ అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. దీంతో 15 కోట్ల రూపాయలకు రోహిత్‌ను రీటేన్‌ చేసుకున్న ముంబై జట్టు ఒక్కో పరుగుకు 5.24 లక్షల రూపాయలు చెల్లించినట్లయింది.

బెన్‌స్టోక్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌

2017 ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక ధర(14. 50 కోట్లు)కు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు ఈ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌. అయితే 13 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌ కేవలం 196 పరుగులు చేసి, 8 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 6.37 లక్షలు, ఒక్కో వికెట్‌కు 1.56 కోట్ల రూపాయలు చెల్లించినట్లయింది. కాగా రాజస్థాన్‌ జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు కూడా ఇతడే.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ఢిల్లీ జట్టు 9 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. అయితే యాజమాన్యం తన మీద పెట్టుకున్న అంచనాలకనుగుణంగా అతడు రాణించలేకపోయాడు. 12 ఇన్నింగ్స్‌లో 14.08 సగటుతో 169 పరుగులు మాత్రమే చేసిన మాక్స్‌వెల్‌కు ఒక్కో పరుగుకు 5.32 లక్షల భారీ మొత్తం చెల్లించినట్టయింది.

విరాట్‌ కోహ్లి... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని బెంగళూరు యాజమాన్యం 17 కోట్ల రూపాయలు చెల్లించి అంటిపెట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. 14 ఇన్నింగ్స్‌లో 48.18 సగటుతో 530 పరుగులు చేసిన కోహ్లి తన విలువకు తగ్గట్టుగా రాణించాడు కోహ్లి చేసిన ఒక్కో పరుగు విలువ 3.20 లక్షలు.

హార్ధిక్‌ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ 11 కోట్ల రూపాయలకు రీటేన్‌ చేసుకుంది. 13 మ్యాచ్‌లాడిన పాండ్యా కేవలం 260 పరుగులు చేసి 18 వికెట్లు తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 4. 24 లక్షలు, ఒక్కో వికెట్‌కు 6.11 లక్షల రూపాయలు ఆర్జించాడన్న మాట.

రిషభ్‌ పంత్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో (ఇప్పటి వరకు) అత్యధిక పరుగులు(684) చేసిన ఘనత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు రిషభ్‌ పం‍త్‌కే దక్కుతుంది. ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకొన్న ఈ యువ ఆటగాడు అద్భుత ప్రదర్శన కనబరచి ‘స్టార్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలిచాడు. 8 కోట్ల రూపాయలకు పంత్‌ను రీటేన్‌ చేసుకున్న ఢిల్లీ జట్టుకు అతడు న్యాయం చేశాడనే చెప్పాలి. 14 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 52. 61 సగటుతో 684 పరుగులు చేశాడు. అంటే ఒక్కో పరుగుకు పంత్‌ తీసుకున్న మొత్తం 1. 16 లక్షలు అన్నమాట.

జోస్‌ బట్లర్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌

ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను 4.40 కోట్ల రూపాయలు వెచ్చించి రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. 13 ఇన్నింగ్స్‌(ఇప్పటి వరకు)లో ఆడిన బట్లర్‌ 548 పరుగులు చేశాడు. ఇందులో ఐదు వరుస అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఒక్కో పరుగుకు 80 వేల రూపాయలు ఆర్జించాడు.

ఆండ్రూ టై... కింగ్స్‌ పంజాబ్‌

ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టైని పంజాబ్‌ ఫ్రాంచైజీ 7. 20 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ తిప్పలు పెట్టి పర్పుల్‌ క్యాప్‌(ఇప్పటి వరకు) సాధించాడు.14 మ్యాచులాడిన టై 24 వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు. అంటే ఆండ్రూ టై తీసిన ఒక్కో వికెట్‌ విలువ అక్షరాలా ముప్పై లక్షలు.

ట్రెంట్‌ బౌల్ట్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఈ సీజన్‌లో 18 వికెట్లు తీసిన ఈ కివీస్‌ బౌలర్‌ను ఢిల్టీ జట్టు 2. 20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది తాను తీసిన ఒక్కో వికెట్‌కు 12. 2 లక్షల రూపాయల చొప్పున ఆర్జించాడన్న మాట.

మయాంక్‌ మార్కండే.. ముంబై ఇండియన్స్‌

భారత యువ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే ముంబై జట్టు తనపై వెచ్చించిన 20 లక్షల రూపాయలకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. టోర్నీ మొత్తంలో 15 వికెట్లు తీసిన మయాంక్‌ ముంబై జట్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మయాంక్‌ తీసిన ఒక్కో వికెట్‌ విలువ 1. 33 లక్షల రూపాయలు.