భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణాలు అవసరం లేదు. ఏదో ఒక సాకు దొరికితే చాలు అన్నట్లుగా ఉంది సౌదీ అరేబియాలో. ప్రస్తుతం ఆ దేశంలో విడాకులు కుప్పలు తెప్పలుగా జరుగుతూ పోతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది.
ఈ మధ్య ఒకాయన భార్య తనను దాటుకొంటూ ఒకడుగు ముందుగా నడుస్తున్నదని ఆగ్రహంతో విడాకులు ఇవ్వడం జరిగింది. ఇద్దరు నడుచుకొంటూ వెడుతుండగా, ఆమె ఒక్కడుగు భర్తకన్నా ముందుగా నడుస్తున్నది.
దానితో కోపం వచ్చి తన వెనుకే నడవాలని చెప్పి చూసాడు. పలు మార్లు చెప్పినా ఆమె ఏదో ఆలోచిస్తూ వినిపించుకోకుండా అట్లా నడుస్తూనే ఉంది. దానితో కోపం వచ్చి ఆమెకు విడాకులు ఇచ్చేసాడు.
మరో సంఘటనలో పెళ్లి కాగానే హానీమూన్ వెళ్ళినపుడు తనకు ఇష్టం లేకుండా భార్య కాళ్లకు పట్టీలు వేసుకున్నదంటూ కోపంతో విడాకులు ఇచ్చేసారు.
మరో సందర్భంలో రాత్రి స్నేహితులకు ఇచ్చిన విందులో పొరపాటున మేక తల మాంసం వడ్డించలేదని కోపంతో భార్యకు విడాకులు ఇచ్చేసారు. విడాకుల ధోరణి పెరగడంతో యువ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో తల్లి తండ్రులలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు.