//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విమాన ప్రయాణికులకు డిజిటల్ ఐడి తప్పనిసరి

Category : business national

ఇకపై విమాన ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్ నంబర్ వంటి డిజిటల్ ఐడీని సమర్పించడం తప్పనిసరి. విమాన ప్రయాణానికి పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టే యోచనలో ఉండడంతో విమాన టిక్కెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు తమ వినూత్న డిజిటల్ ఐడీని సమర్పించే విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నది అని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. 

ఈ ఆలోచనకు అనుగుణంగా ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని, వాటిలో అనువైనవాటిని పరిశీలించి నూతన విధానంలో పొందుపర్చడంపై ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతం విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేందుకు గేటు వద్ద భద్రతా సిబ్బందికి తమ వ్యక్తిగత ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారు టిక్కెట్ ప్రింటవుట్‌లను వెంట తెచ్చుకుంటున్నారని, ఇకపైన కూడా వాటిని తెచ్చుకోవచ్చని, వాటిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతిస్తారని, అయితే డిజిటల్ టిక్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా ఉందని చెప్పారు. డిజిటల్ విధానం నిర్బంధం కాకపోయినా పూర్తి వివరాలను కంప్యూటర్ ద్వారానే నిర్వహించడానికి సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ విధానం అమలు కోసం డిజిటల్ వర్కింగ్ గ్రూపును నెలకొల్పిందని, ఈ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించడంపై ప్రయాణికుల నుంచి సూచనలు తీసుకుంటుందని తెలిపారు. నెల రోజుల పాటు వచ్చే అభిప్రాయాలను పరిశీలించి డిజిటల్ విధానాన్ని ఖరారు చేస్తుందని తెలిపారు. 

ఇది ప్రయాణికులపై బలవంతంగా రుద్దేది కాదని, భౌతికంగా ప్రింటవుట్ టిక్కెట్లను వెంట తెచ్చుకునేవారిని సైతం అనుమతిస్తామని తెలిపారు. డిజిటల్ లేదా ప్రింటవుట్ టిక్కెట్లలో దేన్ని ఎంచుకోవాలన్నది ప్రయాణికుల ఇష్టానికే వదిలేస్తామని తెలిపారు. డిజిటల్ విధానం అమలులోకి తెచ్చిన తర్వాత ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 

డిజిటల్ విధానంలో ప్రయాణికుల గుర్తింపు కోసం వివరాలను తీసుకోవడం అనివార్యం కాబట్టి ఆధార్ లేదా పాన్‌కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలోనే తీసుకుంటున్నాం తప్ప నిర్బంధంగా ఆధార్ కార్డు లేదా పాన్‌కార్డు వివరాలను ఇవ్వాల్సిందే అనే ఒత్తిడి ఉండదని తెలిపారు.