టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ధోని మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు.
వారిద్దరి సరసన ధోని కూడా చేరనున్నాడు. ఆ రికార్డు ఏంటంటే.. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం. ప్రస్తుతం ధోని 497(టెస్టులు-90, వన్డేలు-318, టీ20-89) మ్యాచ్‌లతో పదో స్థానంలో ఉన్నాడు.
ధోని బ్రిస్టల్‌లో జూలై 8వ తేదీన ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టీ20 మ్యాచ్‌తో 500 మ్యాచ్‌ల క్లబ్లో చేరనున్నాడు. ప్రస్తుతం ధోని ఐర్లాండ్‌తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ధోని ఈ ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే అతను ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 505కు చేరనుంది.
ఈ రికార్డులో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 664 మ్యాచ్‌లతో(టెస్టులు-200, వన్డేలు-463, టీ20-1) మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత ఇండియా తరఫున ఈ రికార్డును రాహుల్ ద్రవిడ్ సాధించాడు. ద్రవిడ్ 509మ్యాచ్‌లతో(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) రెండో స్థానంలో ఉన్నాడు.
అతి తర్వలో ధోని భారత్ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా రికార్డును నెలకొల్పనున్నాడు. అన్ని దేశాల ప్లేయర్స్‌తో పోలిస్తే సచిన్‌దే అగ్రస్థానం. శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే రెండో స్థానం, కూమార సంగాక్కర మూడో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని 497 మ్యాచ్‌లతో పదో స్థానంలో ఉన్నాడు.