మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్‌బాల్‌లో ప్రవేశముందన్న విషయం తెలిసిందే. ఆదివారం సాకర్‌లో అతడు ఎంతటి సమర్థుడో చూసే అవకాశం అభిమానులకు దక్కింది. అతడేమీ నిరాశపరచలేదు. చక్కని ప్రదర్శనతో అలరించాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలో ఆల్ హార్ట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధోని ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బెక్‌హామ్ తరహాలో రెండు చూడముచ్చటైన ఫ్రీ కిక్ గోల్స్ కొట్టి అభిమానులను అబ్బురపరిచాడు. ధోని రాణించడంతో ఆల్హార్ట్స్ జట్టు 7-3తో ఆల్స్టార్స్పై విజయం సాధించింది. సినీతారలతో నిండిన ఆల్‌స్టార్స్ జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించాడు.