మంగళవారం ఆసీస్‌తో జరిగిన రెండో టీ-20 కోహ్లీ ,ధోనిలకు ప్రత్యేకమనే చెప్పాలి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 40 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. తొలిసారి డకౌట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్‌లో బెరెండార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇది కూడా ఓ రికార్డే.
మరోవైపు మాజీ కెప్టెన్ ధోనీ కూడా ఓ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టీ-20లో ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్ ఐదో బంతికి ధోని స్టంపౌట్ అయ్యాడు. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లో ధోనీ స్టంపౌట్ అవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ధోనీ 16 బంతుల్లో ఒక ఫోర్‌తో 13 పరుగులు చేశాడు. కాగా, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.