లంక గడ్డపై భారత్ జైత్రయాత్రలో మార్పులేదు. అదే జోరు.. అదే ఫలితం. బౌలర్లు ఇచ్చిన శుభారంభాన్ని అందిపుచ్చుకున్న ధవన్ దంబుల్లాలో ధన్ధన్లాడిస్తే, కోహ్లీ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా గ్రాండ్‌గా శుభారంభం చేసింది. మరోవైపు సారథి మారినా.. ఆటగాళ్లు మారినా.. లంకది అదేతీరు. బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి తోడు బౌలర్ల నిరాశాజనక ప్రదర్శనతో ఆ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకుంది.
నిలకడగా ఆడినా భారత్.. ఆల్‌రౌండ్ షోతో తొలి వన్డేలో అదరగొట్టింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (90 బంతుల్లో 132 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో విరాట్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ముందుగా శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. డిక్వెల్లా (74 బంతుల్లో 64; 8 ఫోర్లు), మెండిస్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు), మాథ్యూస్ (50 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), గుణతిలక (44 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత భారత్ 28.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. ధవన్‌కు తోడు కోహ్లీ (70 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
జడేజా స్థానంలో అనుహ్యంగా జట్టులో చేరిన అక్షర పటేల్ ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నాడు. మెండీస్‌ను 36 వద్ద క్లీన్‌బౌల్డ్ చేయడంతో అప్పటి వరకు భారీ స్కోర్ దిశగా సాగిన లంక పతనాన్ని శాసించాడు. 3/34 వికెట్లతో లంక ఇన్నింగ్స్ కుప్ప కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.