//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీలో చేయిదాటిన పరిస్థితి

Category : national

సాధారణంగా కాలుష్యాన్ని కొలిచే చార్టులో సున్నా నుంచి 500 వరకూ రీడింగ్ ఉంటుంది.

ఆ రీడింగ్ గనుక 100 దాటితే ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినట్టు. 400 దాటితే ఊపిరితిత్తులకు ప్రమాదకారకం. రెండు రోజుల నాడు 471 కి వెళ్లిన ఈ రీడింగ్ ఇప్పుడు మరింతగా పెరిగి 726 స్థాయికి చేరింది. ఊపిరితిత్తులను నాశనం చేసి, శ్వాస కోశ వ్యవస్థను దెబ్బతీసే పీఎం (పర్టికులేట్ మ్యాటర్) 2.5 ఢిల్లీ వాతావరణంలో ఉన్న గణాంకాలివి. యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఈ పీఎం ఉన్న గాలిని పీల్చడం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, తక్షణం ఢిల్లీని వదిలి వెళితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని టాప్ డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఢిల్లీ వాసులు ఎయిర్ ప్యూరిఫయర్లను, ఫిల్ట్రేషన్ మాస్క్ లను కొనుగోలు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో 2 కోట్ల మంది గ్యాస్ చాంబర్ లో నివసిస్తున్నారని, సమస్య పక్క రాష్ట్రాల కారణంగా వస్తున్నందున వారితో చర్చిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

కాగా, ఇప్పుడున్న కాలుష్యం స్థాయి గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించలేదని సర్ గంగారామ్ ఆసుపత్రి లంగ్ సర్జన్ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ డాక్టరుగా, తన అభిప్రాయం ప్రకారం, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అభిప్రాయపడతున్నానని, ప్రజలను రక్షించాలంటే, వారిని ఢిల్లీ దాటించడమే ఉత్తమమని, అన్ని పాఠశాలలు, ఆఫీసులు మూసివేయాలని, రహదారులపైకి ట్రాఫిక్ ను అనుమతించరాదని అన్నారు.