రిలయన్స్ జియో రాకతో దేశవ్యాప్తంగా డేటా ధరలు ఒక్కసారిగా కిందకి దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదో జనరేషన్ టెక్నాలజీ(5జీ) కమర్షియల్‌గా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 5జీ రాకతో 2020 నాటికి డేటా ధరలు మరింత కిందకి పడిపోనున్నాయని రిపోర్టులు తెలుపుతున్నాయి. ప్రాథమిక దశలో ఉన్న 5జీ ఆవిష్కరణ, ఇంటర్నెట్ కనెక్టివిటీకి బూస్ట్‌ని అందిస్తుందని హువావే టెక్నాలజీస్ ప్రకటించింది.
ఒక్కసారి 5G సర్వీసులు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత, టెల్కోలకు డేటా ప్రొడక్షన్ వ్యయాలు ప్రస్తుతమున్న ఖర్చుల కంటే 10 రెట్లు తగ్గుతాయని హువావే వైర్లెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇమ్మాన్యూల్ కోయెల్హో అల్వ్స్ చెప్పారు. దీంతో డేటా మరింత చౌకగా లభ్యమవుతుందని తెలిపారు. భారత్‌లో ఇప్పటికే డేటా ధరలు ప్రపంచవ్యాప్తంగా కంటే తక్కువగా ఉన్నాయి. జియో రాకతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
4జీ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేసిన రిలయన్స్ జియో.. మార్కెట్లో ధరల యుద్ధానికి తెరతీసింది. చాలా తక్కువ ధరలకు డేటాను ఆఫర్ చేయడం ప్రారంభించింది. జియోకు పోటీగా ఇతర టెలికాం కంపెనీలు కూడా అదేమాదిరి ధరలు తగ్గించుకుంటూ వెళ్తున్నాయి. రెవెన్యూలు నష్టపోతున్నా.. కస్టమర్లను కాపాడుకోవడానికి టెల్కోలు తమ డేటా ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి.
5Gతో ఆపరేటర్ల డేటా ప్రొడక్షన్ ఖర్చులు తగ్గుతాయని తెలిసింది. అప్పుడు చౌక ధరల్లో డేటా అందించడం ద్వారా కంపెనీలు కూడా లాభాలు వస్తాయన్నారు. 4G కాలంలోనే 5G నెట్వర్క్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ సన్నాహాలు ప్రారంభమయ్యాయని అల్వ్స్ తెలిపారు. 5Gలో భారత్ ముందంజలో ఉంటుందని, టెక్నాలజీ అభివృద్ధికి రూ.500 కోట్ల ఫండ్‌ను సృష్టించామని, 2020 నాటికి 5G సేవలను ఆవిష్కరించడానికి రోడ్‌మ్యాప్ కోసం ఓ హై-లెవల్ కమిటీ పని చేస్తోంది.