డా. దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు.1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. దాసరి గారికి దాసరి, దర్శక రత్నఅని పేర్లు కలవు.దాసరి గారి భార్య పేరు దాసరి పద్మ.
దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.
దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.
ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.
రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.
అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.
దాసరి నారాయణ గారికి వచ్చిన అవార్డులు ;
1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నాడు.
స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు.
1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందాడు.
1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందాడు.
1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందాడు.
ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందాడు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నాడు.
జ్యోతిచిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందాడు.
పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యాడు.
ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.
దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించాడు.