Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2 వ తరగతి చిన్నారి పై లైంగిక దాడి....!

Category : national

వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లపై హత్యాచారాలు జరుగుతున్నాయి. ఓ బాలికల పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై అదే పాఠశాలలోని డాన్స్ టీచర్ అర్నెల్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. ఈ విషయమై ఫిర్యాదు అందగానే పోలీసులు సదరు డ్యాన్స్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గురువారం స్కూల్‌కు వెళ్లనంటూ ఆ చిన్నారి మొరాయించడంతో బాలిక తల్లి ఏం జరిగిందంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శుక్రవారం దేశప్రియ పార్క్‌లో ఉన్న ఆ ప్రముఖ పాఠశాల ఎదుట ఆ చిన్నారి తల్లితోపాటు ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

అది బాలికల పాఠశాల అని, అందులో పురుష ఉపాధ్యాయులు ఎందుకున్నారని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాలలో సీసీ కెమెరా సిస్టం లేకపోవడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్కూలు వద్ద తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఓ దశలో తల్లిదండ్రులు పాఠశాలపై, యాజమాన్యంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది.

ఈ క్రమంలో ఇద్దరు టాలీగంజ్ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ స్పందించారు. స్కూలు యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.'పాఠశాలల పనితీరుకు సంబంధించి కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి..' అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు పాఠశాల యాజమాన్యం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సుధేష్ణ రే మాట్లాడుతూ.. 'పాఠశాల యాజమాన్యం ఈ ఘటనను ఖండించలేదు.. బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఆవేదనను యాజమాన్యం అర్థంచేసుకుంది..' అని అన్నారు.

అంతేకాదు, 'ఇదొక దురదృష్టకరమైన ఘటన.. మేం స్కూల్ యాజమాన్యం చెప్పింది కూడా విన్నాం. పాఠశాలలో సీసీ కెమెరా సిస్టం లేకపోలేదని, కొన్ని నిర్మాణ పనుల కారణంగా అవి ప్రస్తుతం పనిచేయడం లేదని, శనివారం నాటికి అవి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పింది...' అని పేర్కొన్నారు.

ప్రస్తుతం బాధిత బాలికతో, ఆమె తల్లిదండ్రులతో, పోలీసులతో మాట్లాడాల్సి ఉందని ఆమె వివరించారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి గాను డిసెంబర్ నెలలో కోల్‌కతాలోని మరో పాఠశాలలో ఇద్దరు ఫిజికల్ ట్రైనింగ్ టీచర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Related News