మరోమారు సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ కదం తొక్కింది. అంబటి రాయుడు అమోఘ శతకానికి వాట్సన్ హాఫ్ సెంచరీ తోడైన వేళ లీగ్ టేబుల్ టాపర్ సన్‌రైజర్స్‌పై అలవోకగా గెలుపొందింది. అంతేకాదు వరుసగా ఆరు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్‌కు బ్రేకులేసింది. టోర్నీలో ఇప్పటిదాకా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో స్వల్ప స్కోర్లనూ కాపాడుకుంటూ వచ్చిన హైదరాబాద్‌కు ఈసారి పేసర్లు, స్పిన్నర్లు అండగా నిలవలేకపోయారు.
ప్రత్యర్థి ఓపెనర్ల ధాటికి రైజర్స్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో చెప్పుకోతగ్గ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కాపాడుకోలేకపోయింది. కాగా, రాజస్థాన్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఓడడంతో ధోనీ సేన 16 పాయుంట్లతో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న రెండోజట్టుగా నిలిచింది.
అంబటి రాయుడు (62 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 నాటౌట్) మళ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. టీ20 కెరీర్లో తొలి సెంచరీ కొట్టాడు. అతడికి మరో ఓపెనర్ వాట్సన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57)తోడు కావడంతో ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. ధవన్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79), కెప్టెన్ విలియమ్సన్ (39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) మాత్రమే అర్థ సెంచరీలతో రాణించారు. శార్దూల్ 2 వికెట్లు పడగొట్టాడు. రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే హేల్స్ వికెట్ కోల్పోగా మరోసారి ధవన్, విలియమ్సన్ ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 123 రన్స్ జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. సగం ఓవర్లు ముగిసే సరికి 62/1తో ఉన్న రైజర్స్.. ఆ తర్వాత గేరు మార్చింది. చివరి 10 ఓవర్లలో ఆ జట్టు 115 పరుగులు చేసింది.