//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాషాయ పార్టీపై సినీ రంగ ప్రముఖుల విమర్శ

Category : editorial

భారత్‌లో హిందూ ఉగ్రవాదం కాదనలేని సత్యం అని ప్రముఖ నటుడు కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలతో కాషాయ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. 'ఆనంద్‌ వికటన్‌'లో కమలహాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కమలనాథులు విరుచుకుపడుతున్నారు. ఆయనకు మతి చలించింది, వెంటనే చికిత్స చేయించాలి అని బిజెపి సీనియర్‌ నేత వినరు కటియార్‌ నోటికి పదును పెట్టారు. మరో బిజెపి నేత సుబ్రహ్మణియన్‌ స్వామి కమల్‌ అవినీతిపరుడని ధ్వజమెత్తారు. 'హిందూ ఉగ్రవాద' వ్యాఖ్యలకు కమలహాసన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్‌ చేయడం, బెదిరింపులకు దిగడమే కాదు ఆయనపై కేసులు కూడా పెట్టారు. దేశంలో చెలరేగుతున్న హిందూ మతోన్మాదుల హింసాకాండను కమల్‌ హిందూ ఉగ్రవాదంగా పేర్కొనడం వారి ఆగ్రహానికి కారణమైంది. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బిజెపి ఘోరంగా విఫలమైందనీ, హిందూత్వవాదం హింసామార్గాన్ని ఎంచుకొని భౌతిక దాడులకు పూనుకోవడం దేశానికి ప్రమాదకరమనీ కమల్‌ విశ్లేషించారు.

కమలహాసన్‌ వ్యాఖ్యలు తప్పెలా అవుతాయో చెప్పాలని మరో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కమలనాథులను బోనులో నిలబెట్టాడు. నా దేశంలో నైతికత పేరుతో యువ జంటలను వేధిస్తుంటే అది ఉగ్రవాదం కాకపోతే, ఆవులను వధిస్తున్నారన్న చిన్న అనుమానంతో ప్రజల గొంతులు కోస్తుంటే అది ఉగ్రవాదం కాకపోతే, కొద్దిపాటి అసమ్మతిని కూడా సహించలేక మారుపేర్లతో తిడుతూ, బెదిరింపులకు పాల్పడుతుంటే అది ఉగ్రవాదం కాకపోతే... మరేమిటని? ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'నా కన్నా పెద్ద నటుడు' అని పేర్కొన్నందుకు ప్రకాశ్‌ రాజ్‌ మీద కూడా కాషాయ దళాలు తిట్లు, బెదిరింపులు, కేసులతో దండెత్తాయి. కమలహసన్‌గానీ, ప్రకాశ్‌రాజ్‌గానీ సినీ నటులు, సెలబ్రిటీలు గనుక వారిపై హిందూత్వ శక్తులు విరుచుకుపడుతున్నాయి. బెదిరింపులకు దిగుతున్నాయి. కానీ వారు చెప్పింది అక్షరసత్యాలని కాషాయ పరివారపు గత చరిత్ర, నేటి చరిత్ర కూడా చెబుతోంది. శాంతిదూతగా ప్రపంచ మంతా కొలిచే జాతిపిత మహాత్మాగాంధీని చంపిన రక్త చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానిదని ఆరోపణ. స్వాతంత్య్రానంతరం మతమౌఢ్యంతో వేలాది మంది ప్రజలను ఊచకోతకోసి చంపిన చరిత్ర వారిదని, 2002లో గుజరాత్‌లో రెండువేల మంది ముస్లింలను ఊచకోతకోసి చంపిన చరిత్ర బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానిదని, క్రైస్తవ ప్రతినిధి గ్రహం స్ట్తెన్స్‌, ఆయన కుమారుని నిలువునా మంటల్లో కాల్చి చంపిన కిరాతక చరిత్ర వారిదని సినీరంగ ప్రముఖులు విమర్శించారు. ప్రజలందరూ తిరిగే ప్రాంతాల్లో బాంబులు పేల్చి అమాయకులను చంపడం ఉగ్రవాదం అయితే, 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబులు పెట్టి 68 మంది మరణానికి కారణమైన సంఘ్ పరివార్‌ నాయకులు ఉగ్రవాదులు కారా? సంఘ్ పరివార్‌ ఉగ్రవాద సంస్థ కాదా? 2007లో మక్కా మసీదు, అజ్మీర్‌ దర్గాల్లో బాంబు పేలుళ్లు, 2008లో మాలెగావ్‌ పేలుళ్లు జరిపి అనేక మంది ప్రాణాలు తీసిన హిందూత్వ వాదుల చర్య ఉగ్రవాదం కాదా? దబోల్కర్‌, పన్సారే, కల్బుర్గి, గౌరి లంకేష్‌లను తూపాకితో కాచ్చి చంపి పారిపోవడం ఉగ్రవాదం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా హిందూత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సైన్యాలు ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటున్నా యంటేనే వాటి నేరస్థ స్వభావం అర్థమవుతోందని వారు ధ్వజమెత్తారు. హిందూ ఉగ్రవాదం, హిందూత్వ ఉగ్రవాదం అంటే హిందువులను అంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం ఎదురు దాడికి దిగుతోందని, హిందువుల మనోభావాలను నొప్పించినట్లు కేసులు పెడుతోందన్నారు.

నిజానికి ఇస్లామ్‌ ఉగ్రవాదం అంటే ఇస్లామ్‌ మతానికి ఎలా వర్తించదో, హిందూ ఉగ్రవాదం అంటే హిందూ మతానికీ వర్తించదని, నిజమైన ఇస్లామ్‌.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించినట్లే, నిజమైన హిందూమతం కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ మతం పేరుతో రాజకీయాలు నడపాలనుకున్నప్పుడు, రాజకీయాధికారం కోసం మతాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు మతతత్వం అభివృద్ధి చెందుతుందని విమర్శించారు. మతతత్వం ఉగ్రవాదానికి వేదికగా మారుతుందని, ఈ రోజు ప్రపంచ వ్యాపితంగానూ, మన దేశంలోనూ అదే జరుగుతోందన్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి పరివారం హిందూమతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందని, మత ఘర్షణలను సృష్టించి, మతతత్వ భావజాలాన్ని వ్యాపింపజేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంఘ్ పరివార్‌ శక్తులు నేడు ఆవు పేరుతో, లవ్‌ జిహాద్‌ పేరుతో, మతమార్పిడుల పేరుతో దేశవ్యాపితంగా టెర్రర్‌ సృష్టిస్తున్నారని, టెర్రర్‌ సృష్టించేవారిని టెర్రరిస్టులు అనక మరేమంటారని వారు ప్రశ్నించారు. అందువల్ల హిందూత్వ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం అని కమలహసన్‌, ప్రకాశ్‌రాజ్‌లు పేర్కొన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ఉగ్రవాద పరివారాన్నే గాని, హిందువులను కాదని అంటున్నారు. కొద్దిపాటి విమర్శ లను కూడా సంహించలేక బెదిరింపులకూ, దాడులకూ దిగుతున్న సంఘ్ పరివార్‌ సంకుచితత్వానికి, నిరంకుశత్వాకీ, అసహనానికీ వ్యతిరేకంగా గళమెత్తుతున్న లౌకిక ప్రజాతంత్ర శక్తుల చెంతన సినీ రంగ ప్రముఖులు కూడా చేరాయాల్సిన పరిస్తితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు.