టీం ఇండియా ఆటగాడు మహ్మద్ షమికి కాస్త ఊరట లభించింది. షమీపై అతడి భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఇటీవల కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. బుధవారం విచారణకు రావాల్సిందిగా అందులో సూచించారు. ఈడెన్ గార్డెన్స్‌లో 16న కోల్‌కతాతో మ్యాచ్ జరిగిన తర్వాత జట్టు సభ్యులందరూ వెళ్లిపోయినా షమీ మాత్రం కోల్‌కతాలోనే ఉండిపోయాడు. ఈ మేరకు బుధవారం విచారణకు కూడా హాజరయ్యాడు.
అది అలా ఉంటె ఈ కేసులో ఇది వరకే షమీని విచారించిన పోలీసులు తాజాగా మూడు గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ షమీ తిరిగి జట్టులో చేరేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఒకవేళ అవసరం అనుకుంటే మరోసారి అతడిని పిలుస్తామని జాయింట్ కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠీ మీడియాకు తెలిపారు. అవసరం అనుకుంటే షమీని ఏ క్షణాన అయినా మరోమారు పిలుస్తామని, అయితే ప్రస్తుతానికి మాత్రం అటువంటి అవసరం లేదని, షమీ పూర్తిగా సహకరిస్తున్నాడని పేర్కొన్నారు.