లాహోర్ సమీపంలోని కసూర్ పట్టణంలో గత నెల 9న జైనబ్ మృతదేహాన్ని కనుగొన్నారు.ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
జైనబ్ అదృశ్యమైనట్లు తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని,బాలిక చివరిసారి కనిపించిన సీసీటీవీ దృశ్యాలను వెలికితీసింది కూడా తమ బంధువులేనని జైనబ్ కుటుంబం చెప్తోంది.ఒక బాలికను ఒక వ్యక్తి చేయిపట్టుకుని తీసుకెళుతున్న సదరు సీసీటీవీ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృతంగా పంపిణీ అయింది.నిందితుడిని పట్టుకునేందుకు 1,150 మంది డీఎన్ఏ నమూనాలను పరిశీలించినట్లు సీఎం షాబాజ్ షరీఫ్ తెలిపారు.
కాగా చిన్నారి జైనబ్ అన్సారీపై అత్యాచారం చేసి,హత్య చేసిన దారుణానికి సంబంధించిన నిందితుడు ఇమ్రాన్ అలీ అనే 24 ఏళ్ల యువకుడికి ఈ శనివారం జరిగిన విచారణలో న్యాయస్థానం అపహరణ,అత్యాచారం,హత్య,తీవ్రవాద నేరాలకు గాను అతనికి నాలుగు మరణ శిక్షలు విధించింది.
అలీపై మరికొన్ని హత్య,అత్యాచార నేరారోపణలూ ఉన్నాయి.ఆ కేసుల్లో విచారణ జరగాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది ఖాదిర్ షా రాయ్‌టర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
జైనబ్ కేసులో పదుల సంఖ్యలో సాక్షులను విచారించడంతో పాటు ఫోరెన్సిక్,డీఎన్ఏ,పాలిగ్రాఫిక్ పరీక్షల ఫలితాలను పరిశీలించిన తరువాత న్యాయమూర్తి మరణశిక్షలు విధించారు.
దీంతో పాటు భారీమొత్తంలో జరిమానా కూడా విధించారు.తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ఇమ్రాన్‌కు 15 రోజుల సమయం ఇచ్చారు.అయితే,అలీ నేరాన్ని అంగీకరించడంతో ఆయన తరఫు న్యాయవాది కేసు నుంచి తప్పుకొన్నారు.న్యాయస్థానం ఈ తీర్పు చెప్పేటప్పటికి జైనబ్ తండ్రి అక్కడే ఉన్నారు.
కేసు దర్యాప్తుపై తనకు మొదట అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత పురోగతి సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.జియో న్యూస్ కథనం ప్రకారం అనుమానితుడు కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే.అయితే అతడు తమ బంధువు అనే మాటను అన్సారీ తిరస్కరించారు.