వస్తు సేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అసోంలోని గువాహటిలో గురువారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండు రోజుల పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏసీ రెస్టారెంట్ల దగ్గర్నుంచి షాంపూల వరకు దాదాపు 160 వస్తువులపై పన్ను తగ్గే అవకాశాలున్నాయి.
జీఎస్టీ కింద 28శాతం పన్ను శ్లాబులో ఉన్న కొన్ని నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించాలని ఇటీవల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రస్తుత కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.28శాతం శ్లాబులోని దాదాపు 80శాతం వస్తువులను కింది శ్లాబుల్లోకి మార్చే అవకాశముంది. చేతివృత్తులు, ప్లాస్టిక్ వస్తువులు, షాంపూలను 28శాతం నుంచి 18 లేదా 12శాతం శ్లాబులోకి మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేగాక.. ఏసీ రెస్టారెంట్లను కూడా మరో శ్లాబుకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో జీఎస్టీ రిటర్నుల దాఖలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులు నెలవారీగా కాకుండా మూడు నెలలకోసారి రిటర్నులు దాఖలు చేసే ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను జీఎస్టీ కిందకు తీసుకురావాలనే అంశంపై ఈసారి కూడా చర్చ జరిగే అవకాశం లేనట్లే కన్పిస్తోంది.