దేశీయ రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకులకు, మేనేజ్మెంట్కు మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బైట పడడంతో ఈ కంపెనీ భవిష్యత్ పట్ల అనుమానాలు చెలరేగుతున్నాయి. శనివారం జరిగిన వార్షిక వాటాదారుల సాధారణ సమావేశంకు వ్యవస్థాప ఛైర్మెన్ నారాయణ మూర్తితో సహా వ్యవస్థాపకులు, ప్రమోటర్లు మూకుమ్మడిగా డు గైర్హాజరవడం విస్మయం కలిగిస్తున్నది.
దీనితో వ్యవస్థాపకులు సంస్థలోని తమ వాటాను విక్రయించి ఇన్ఫోసిస్‌ను నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు కొంతకాలంగా వస్తున్న కథనాలకు మరింత బలం చేకూరింది. వ్యవస్థాపకులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1981లో కంపెనీ ప్రారంభించిన 36 సంవత్సరాలుగా ఒక్క వ్యవస్థాపకుడు గానీ, ప్రమోటర్ గానీ లేకుండా ఏజీఎం జరగడం ఇదే తొలిసారని ఇన్వెష్టర్లు వాపోతున్నారు. గత ఏడాది ఏజీఎంకు నారాయణమూర్తి తన కొడుకు రోహన్ మూర్తితో కలిసి హాజరయ్యారు.
ఇన్ఫోసిస్ బోర్డు, యాజమాన్యం సంస్థ మూలాలను, విలువలను వదిలి పని చేస్తోందని, సంస్థలో ఆర్థిక వ్యవహారాల్లోనూ కొన్ని అవకతవకలు చోటు చేసుకుంటుండం అభ్యంతరకరంగా ఉందని ఇటీవలి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు బాహాటంగానే మేనేజ్మెంట్పై విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా సంస్థ సహవ్యవ స్థాపకులు బోర్డుపై 'అత్త' పాత్ర పోషిస్తూ ఇన్ఫోసిస్ ఎదుగుదలను అడ్డుకుంటున్నట్టుగా యాజమాన్యం భావిస్తూ వస్తోంది.
ఇలా ఉండగా, వచ్చే రెండేళ్లలో 10 వేలమంది కొత్త ఉద్యోగులను తీసుకొంటున్నట్లు సీఈఓ విశాల్ సిక్కా ప్రకటించిన రెండు రోజులకే 11 వేలమందిని తీసివేయడం మరోవంక పరిస్థితులు సవ్యంగా లేవని స్పష్టం చేస్తున్నది.