మరోసారి క్రీడల్లో జాతీయ స్థాయిలో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్ళ విషయంలో కనీస మానవత్వాన్ని ప్రదర్శించడం లేదు. తెలుగమ్మాయిలు అరుణారెడ్డి, మేఘనారెడ్డి వ్యక్తిగత కోచ్‌లకు ఐఓఏ గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు.
వ్యక్తిగత కోచ్, మేనేజర్, ఫిజియో, ట్రెయినర్, వీడియో అనలిస్ట్, మసాజర్‌తో పాటు తల్లి లేదా తండ్రిని కొందరు క్రీడాకారులు తమ వెంట తీసుకెళ్లగా.. అరుణ, మేఘనల కోచ్‌లను అనుమతించడం లేదు.
కామన్వెల్త్ క్రీడలకు వెళ్లిన 218 మంది క్రీడాకారులు.. వందకు పైగా సహాయ సిబ్బందిలో ఒక్క జిమ్నాస్టిక్స్ కోచ్‌కు కూడా స్థానం లభించలేదు. కోచ్, మేనేజర్ లేకుండానే ఏడుగురు జిమ్నాస్ట్‌ల భారత బృందం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే వీరిద్దరూ ప్రతిభ ఉన్న క్రీడాకారులు కావడంతో ఐఓఏ తీరుపై విమర్శలు చెలరేగాయి.
ఇటీవల ప్రపంచ కప్‌లో కాంస్యం సాధించిన అరుణ.. రియో ఒలింపియన్ వర్వరా దగ్గర శిక్షణ తీసుకుంటున్న మేఘనలకు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే అవకాశాలున్నాయి. దీనితో వారికి కోచ్ ల అవసరం ఎంతగానో ఉంది.