బెంగళూరులోని శాంతినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ హారిస్ కుమారుడు మహ్మద్ నల్పాద్ హారిస్‌పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు,అతడి అనుచరులు స్థానిక వ్యాపారవేత్త లోక్‌నాథ్ కుమారుడు విద్వాంత్ పై దాడిచేసి,తీవ్రంగా గాయపరిచిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
మహ్మద్ నల్పాద్,విద్వాంత్ మధ్య ఫెర్గీ కేఫ్‌లో గొడవ జరిగింది.మొహమ్మద్ నల్పద్ అతని అనుచరులు కలిసి ఫెర్గీ కేఫ్ లో కాఫీ తాగడానికి వెళ్లగా నల్పాద్ అతడి స్నేహితులు విద్వాంత్ ని కేఫ్‌లో సరిగ్గా కూర్చోమని చెప్పడంతో వివాదానికి దారితీసింది.మహ్మద్ నల్పాద్,అతడి 10 మంది అనుచరులు విద్వాంత్‌పై దాడిచేశారు.తీవ్రంగా గాయపడిన విద్వాంత్ను చికిత్స కోసం అతడి స్నేహితులు మాల్యా హాస్పిటల్‌కు తరలించారు.అక్కడకు కూడా తన అనుచరులతో వెళ్లి నల్పాద్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
విద్యాంత్ స్నేహితుడు ప్రవీణ్ వెంకటాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.బాధితుడు విద్వాంత్‌పై కేఫ్‌లో దాడిచేసిన నల్పాద్ మరోసారి హాస్పిటల్‌కు వెళ్లి బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.విద్యాంత్ ఫిర్యాదు చేసే స్థితిలో లేడని,దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.విద్వాంత్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే కుమారుడు మహ్మద్ నల్పద్ హారీస్,అతడి అనుచరులపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.ఇందులో ఎమ్మెల్యే కుమారుడే ప్రథమ నిందితుడని పేర్కొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై స్పందించి తప్పుచేసిన వారి విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.చట్టం ముందు అందరూ సమానమేనని,నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు.