హైదరాబాద్: అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. అలాంటిదేమీ లేదని కంపెనీ ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా ‘ఎకనామిక్స్ టైమ్స్’ పత్రికతో చెప్పినా, పనితీరు సరిగా లేదనే పేరుతో సుమారు 25,000-30,000 మందిని ఇంటికి పంపించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసినట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగ వర్గాలు చెప్పాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రం నుంచి సుమారు 4,000 మంది ఉంటారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బి వీసాల జారీని కఠినం చేయడంతో అమెరికా కంపెనీ అయిన కాగ్నిజెంట్ కూడా అక్కడ నియామకాలు పెంచి, భారత్ లో తగ్గించాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం పనితీరు సరిగాలేని సుమారు 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశం ఉందని ఇటీవల ప్రకటించింది.
అయితే ఈ ఏడాది తొలగింపులు అంతకంటే భారీగానే ఉంటాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ‘పని తీరు సరిగాలేని ఉద్యోగులను ఇంటికి పంపించడం సాధారణమే. అయితే ఏటా వీరి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో అర శాతం నుంచి ఒక శాతంలోపే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 7 నుంచి 10 శాతం మంది ఉద్యోగులను ఇలా ఇంటికి పంపిస్తున్నారు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగి ఒకరు చెప్పారు.రాజీనామాల కోసం ఒత్తిడి
పనితీరు సరిగా లేదని తేల్చిన ఉద్యోగుల చేత రాజీనామా చేయుంచేందుకూ కాగ్నిజెంట్ అనేక ఎత్తుగడలు వేస్తోందని తెలుస్తోంది. తమ పేర్లు లిస్టులో ఉన్నాయని తెలిసి ఇప్పటికే కొంత మంది స్వచ్ఛందంగానే కంపెనీ నుంచి తప్పుకున్నారు. మిగిలిన వారి చేత రాజీనామా చేయుంచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పటికీ వినకపోతే నాలుగు నెలల జీతం ఇస్తాం... రాజీనామా చేస్తావా? అని అడుగుతున్నట్టు సమాచారం. ఇలా అడుగుతున్న ఉద్యోగుల్లో పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగులూ ఉన్నారు. గత పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు మంచి పనిమంతుడని ఏటా జీతాలు పెంచి, ఇప్పుడు హఠాత్తుగా పనితీరు బాగోలేదు రాజీనామా చేయండి అని దబాయించడం ఎంత వరకు న్యాయం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.బయటి కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకుని కాగ్నిజెంట్‌నే నమ్ముకున్న ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత మంది ఉద్యోగులను ఒక్కసారే బయటికి పంపిస్తే పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయనే భయంతో కాగ్నిజెంట్ గత మూడు నెలల నుంచి దశల వారీగా ఇలా ఉద్యోగులను బయటికి పంపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.తగ్గిన అవకాశాలు.
కాగ్నిజెంట్ నుంచి బయటపడుతున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమూ తీవ్ర సమస్యగా మారిపోయింది. ‘కాగ్నిజెంట్‌లో ఏటా రూ.6 లక్షల వేతనం తీసుకునేదాన్ని. ఇప్పుడు వేరే కంపెనీల్లో ప్రయత్నిస్తుంటే రూ.4 లక్షల కంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉద్యోగి ‘ఆంధ్రజ్యోతి బిజినె స్’తో అన్నారు. గతంలో కాగ్నిజెంట్ నుంచి వచ్చే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు మంచి జీతాలు ఆఫర్ చేసేవి. ఇప్పుడు ఆ కంపెనీయే ఉద్యోగులను తీసేస్తోందని తెలియడంతో వీలైనంత తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
నేడు లేబర్ కమిషనర్ దగ్గరికి
చెన్నైలోనూ కాగ్నిజెంట్ ఇదే మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసివేయడంతో వారు అక్కడి లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఇపుడు హైదరాబాద్ యూనిట్లో వేటు పడే ఉద్యోగులూ మంగళవారం లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విధుల నుంచి తొలగించే వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ కాగ్నిజెంట్ వివక్ష చూపిస్తోందని ఉద్యోగుల ఆరోపణ. డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్ల వంటి పెద్ద ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతం ఇచ్చి పంపిస్తుంటే, గొడ్డు చాకిరీ చేసే తమను మాత్రం రెండు నెలల నోటీసుతో ఇంటికి పంపిస్తోందని చెబుతున్నారు.