Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఫైనల్ ?

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టి పి సి సి పై రగడ జరుగుతుండగానే సీఎల్పీ లీడర్ ఎవరు అన్న అంశం తెరపైకి వచ్చింది. ఇక ఐదేళ్లపాటు దీటుగా టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అసెంబ్లీలో ప్రజా పక్షాన నిలబడి ప్రజల సమస్యల కోసం గళం వినిపించడానికి ఒక బలమైన నాయకుడిని సీఎల్పీ లీడర్ గా ఎన్నుకో వాలని అధిష్టానం భావిస్తోంది. దానికోసం ఇప్పటికే ఆశావహులు మాకంటే మాకంటూ సీఎల్పీ లీడర్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన చాలామంది నేతలు సీఎల్పీ నేతగా తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ముందు తమ డిమాండ్ ఉంచారు. ఈనెల 16న సమావేశమయ్యే కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను ఎన్నుకోవాలని నిర్ణయించింది. ఇక సీఎల్పీ నేతగా తమకు అంటే తమకు అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో సీనియర్లు ఓటమి పాలవడంతో గెలిచిన నాయకులు చేస్తున్న హడావిడి అంత ఇంత కాదు. ఒకపక్క ఆపరేషన్ ఆకర్ష్ అంటూ గులాబీ అధినేత గెలిచిన నాయకులకు గాలం వేస్తుంటే ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాకు పదవి ఇవ్వండి. లేదా ఒక ఎంపీ స్థానం ఇవ్వండి... అంటూ ఎవరి డిమాండ్స్ వారు చెబుతున్నారు. ఇక ప్రధానంగా సీఎల్పీ లీడర్ విషయానికి వస్తే ఈ పోటీలో శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు ఉన్నారు. ఇప్పటికే ఈ నేతలందరూ ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. సీఎల్పీ నేతగా తమను ఎన్నుకోవడానికి వారికున్న అర్హతలను, వారి సామర్థ్యాలను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఇక ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం సీఎల్పీ నేతను ఎన్నుకునే బాధ్యతను వేణుగోపాల్ కు అప్పగించింది. ఇక ఆశావహులంతా వేణుగోపాల్ చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే సీఎల్పీ నేతగా ఈసారి భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. గతంలో భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గారు, చీఫ్ విప్ గాను పని చేశారు. ఇక శ్రీధర్ బాబు మంత్రిగా పని చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన ఆయనకు సీఎల్పీ నేతగా అంత పెద్ద బాధ్యత అప్పచెప్పడం అధిష్టానానికి ఇష్టం లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కే సీఎల్పీ నేతగా అవకాశం ఇద్దామంటే ఆయన టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయనను అదే స్థానంలో కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది.

ఇక సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇవ్వడానికి టీపీసీసీ హోదాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఆలోచనను సైతం విరమించుకున్నారు .

సబితా ఇంద్రారెడ్డికి కానీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కానీ ఎవరో ఒకరికి పిఏసి చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి ఇక వీరిద్దరిదీ కూడా అదే పరిస్థితి. సామాజిక వర్గం నేపథ్యంలోనే వీరికి అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రధానంగా సీఎల్పీ నేతగా అవకాశం ఉంది మాత్రం భట్టి విక్రమార్క కే. భట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం రాజకీయంగా కూడా మంచి అనుభవం ఉండటం, వివాదాస్పద నేత కాకపోవడం వంటి కారణాలతో ఆయనకు సీఎల్పీ లీడర్ గా అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణాలు పాటించినట్లు అవుతుందని, అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చినట్లుగా ఉంటుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక 16వ తేదీన సీఎల్పీ నేత ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఆరోజు ఏం జరగనుందో అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దళితుడిని సిఎం చేస్తానని హామీ ఇచ్చి చేయని ముఖ్యమంత్రి వున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఒక దళితుడికి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ కు దళితుల పట్ల ఉన్న ప్రాధాన్యత కు చిహ్నం. ఇప్పటికే రకరకాల గందరగోళాలు చోటు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎన్నిక మరెన్ని కుమ్ములాటలకు కారణం కానుందో వేచి చూడాల్సిందే.

Related News