ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి గల చైనా చరిత్రలో మొదటిసారిగా తన సైనికుల సంఖ్యను భారీగా, సగంకు పైగా తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 23 లక్షలుగా ఉన్న సైన్యాన్ని 10 లక్షల లోపుకు తీసుకువచ్చే పక్రియను చేపట్టింది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా మిలిటరీని తగ్గిస్తున్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అధికార పత్రిక వెల్లడించింది.
ఆర్మీ సంఖ్యను తగ్గించి, నేవీ, మిస్సైల్ బలగాలను పెంచాలని భావిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. చైనా వ్యూహాత్మక లక్ష్యాలు, రక్షణ అవసరాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు జరుగుతున్నాయి. గతంలో పీఎల్ఏ ఆర్మీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పుడు నేవీ, ఇతర రక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేయడానికి ఈ మార్పులు చేస్తున్నది అని ఆ పత్రిక చెప్పింది.
పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ స్ట్రేటజిక్ సపోర్ట్ ఫోర్స్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్‌లలో బలగాల సంఖ్య పెరగనుండగా. పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్‌లో మాత్రం ఇప్పుడున్న బలగాలే కొనసాగనున్నాయి. గతంలో ఆర్మీని మూడు లక్షల వరకు తగ్గిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు.
2015నాటికి చైనా ఆర్మీ సంఖ్య 23 లక్షలని గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఈ ఆర్మీ సంస్కరణల వల్ల విదేశాల్లో మరింత సమర్థంగా పీఎల్ఏ తమ మిషన్లను విజయవంతం చేయగలుగుతుందని చైనా ఆర్మీ కంట్రోల్ అండ్ డిపార్టుమెంట్ అడ్వైజర్ జు గువాన్గ్యు అన్నారు. అటు దక్షిణ చైనా సముద్రం, ఇటు ఇండియాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఆర్మీ సంస్కరణలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరింప చేసుకొంటున్నది.