ఒక వంక హాంబర్గ్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ పరస్పర అభినందనలతో ప్రశంసలు కురిపించు కుంటుండగా, చైనా అధికార మీడియా భారత్‌పై చెలరేగిపోతున్నది. ఏదో రకంగా భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక సిక్కింలో చిచ్చు పెడుతామని బెదిరిస్తున్నది. అక్కడ జరిగే స్వాతంత్య్ర ఉద్యమాలకు మద్దతునిస్తామని తన వంకర బుద్ధిని బయటపెట్టింది.
సిక్కిం భారత్‌లో భాగమేనని ఇదివరకు గుర్తించామని, అయితే ఇప్పుడు ఆ నిర్ణయంపై పునరాలోచిస్తామని తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అదే సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా భూటాన్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఉభయ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సంక్షోభాన్ని అడ్డం పెట్టుకొని గ్లోబల్ టైమ్స్ పత్రిక మరోసారి రెచ్చిపోయింది.
సిక్కింకు స్వాతంత్య్రం కావాలని కోరేవారు చైనాలో, సిక్కింలో ఉన్నారని, వారి ఆకాంక్షలను ప్రోత్సహిస్తామని ఆ పత్రిక తెలిపింది. ప్రాంతీయ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలను భారత్ వీడకపోతే సిక్కిం విషయంలో 2003లో తాము తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాల్సి ఉంటుందని బెదిరించింది.
గతంలో భారత్ తమపై దలైలామా పాచికను విసిరేదని, ఆ పాచిక పాతదైపోయిందని ఎద్దేవా చేసింది. సున్నితమైన అంశాల విషయంలో చైనా తన వైఖరిని మార్చుకుంటే భారత్‌కు సమస్యలు తప్పవని కుట్ర బుద్ధిని వెల్లడించింది. భూటాన్‌తో భారత్ అసమాన ఒప్పందాలు చేసుకొని ఆ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నదని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. భారత్ ఆధిపత్య ధోరణి ఉచ్ఛదశకు చేరిందని, ఇక మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందంటూ విషం కక్కింది.