కశ్మీర్ అంశంపై భారత్, పాక్ చర్చలకు చైనా మద్దతు ప్రకటించినట్లు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అనుకూల పరిష్కారం లభించాలని చైనా ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘వన్ బెల్ట్– వన్ రోడ్’కార్యక్రమంలో పాల్గొనేందుకు చైనా వచ్చిన షరీఫ్ ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్ను కలిశారు. అనంతరం పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడారు. "కశ్మీర్ అంశంలో పాక్ వాదనను చైనా ఎప్పుడూ సమర్థిస్తూనే ఉంది. భవిష్యత్‌లోనూ ఇదే తరహా మద్దతును అందిస్తుందని ఆశిస్తున్నా"అని మీడియా సమావేశంలో తెలిపారు. చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) పేరుతో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు పెట్టుబడులను 46 బిలియన్ డాలర్ల నుంచి 56 బిలియన్ డాలర్లకు పెంచినట్లు చెప్పారు. అంతేకాదు చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా పాక్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.
కారిడార్(సీపీఈసీ) పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళుతుండడం పాక్ ప్రధాని మాటలకు బలం చేకూర్చుతోంది.కారిడార్ నిర్మాణం చేపట్టినంత మాత్రాన కశ్మీర్ అంశంలో మా నిర్ణయంలో మార్పు ఉండదు’’అని మే 3న పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ పేర్కొనడం గమనార్హం.