ఓవైపు సిక్కిం సరిహద్దులో నెలరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అరుణాచల్ సరిహద్దు సమీపంగా టిబెట్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) రెండు రోజుల క్రితం భారీ సైనిక విన్యాసం జరిపింది. 11 గంటల పాటు ఈ లైవ్ ఫైర్ డ్రిల్ జరిగినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ఎప్పుడు జరిగిందన్నది మాత్రం చెప్పలేదు.
పీఎల్ఏకు చెందిన టిబెట్ మిలిటరీ కమాండ్ ఈ డ్రిల్స్ నిర్వహించినట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ డ్రిల్స్ ద్వారా భారత ప్రభుత్వం, ఆర్మీకి గట్టి హెచ్చరికలు చైనీస్ ఆర్మీ పంపించింది. ఇప్పటికీ అరుణాచల్‌లోని చాలా ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా చెప్పుకుంటున్నది.
మనం బ్రహ్మపుత్రగా పిలిచే యార్లుంగ్ జాంగ్బో నది పరివాహక ప్రాంతంలో ఈ డ్రిల్స్ జరిగాయి. సంయుక్తంగా దాడులు చేసేందుకు వివిధ మిలిటరీ విభాగాలు ఒక్కచోటికి రావడం, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్, మిస్సైల్స్ పరీక్షలు డ్రిల్‌లో భాగంగా నిర్వహించినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. అంతేకాదు శత్రువు ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించే రాడార్ యూనిట్లు, ఆ విమానాలను ధ్వంసం చేయగల సామర్ధంలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు.
జూన్ 16న సిక్కిం సెక్టార్ లోని డోక్లా ప్రాంతంలో చైనా చేపట్టిన రోడ్ నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకోవడం తెలిసిందే. అప్పటి నుండి భారత సైనికులు అక్కడినుండి వెనుకకు వెళ్లాలని చైనా వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రాంతాన్ని తనదిగా చైనా వాదిస్తున్నది. భారత్-చైనా ల మధ్య జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,448 కి మీ పొడవైన సరిహద్దు ఉండగా, అందులో 220 కి.మీ సిక్కిం ప్రాంతంలో ఉంది.