అన్ని వైపుల నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై చైనా మండిపడింది. చరిత్ర నుండి భారత్ పాఠాలు నేర్చుకోవాలని అంటూ 1962 యుద్దాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిక చేసింది. భారత్, చైనా సరిహద్దు ప్రాంతం సిక్కిం సెక్టార్లో ఉద్రిక్తతను ప్రస్తావిస్తూ అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని రావత్ తెలుసుకుంటారన్న నమ్మకం తమకు ఉన్నదని చైనా తెలిపింది.
కైలాష్ మానస సరోవర్ యాత్రను చైనా అడ్డుకోవడం, సిక్కిం సెక్టార్లోని డాంగ్లాంగ్ ప్రాంతంలో సైనిక దళాలను మోహరించడంతో భారత్ కూడా తమ దళాలను అక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలో డాంగ్లాంగ్లోకి భారత్ దళాలు తొలుత ప్రవేశించినట్లుగా చూపిస్తున్న ఫొటోలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం అధికారిక వెబ్సైట్లలోనూ అవి ప్రత్యక్షమయ్యాయి.
మరోవైపు చైనా ఆర్మీ కూడా బిపిన్ రావత్ వ్యాఖ్యలను ఖండిస్తూ అవి పూర్తిగా బాధ్యతారాహిత్య వ్యాఖ్యలని పేర్కొంది. ''పాకిస్తాన్, చైనాలతో యుద్ధంతో పాటు కాశ్మీర్ తరహా అంతర్గత యుద్ధాలను ఒకేసారి ఎదుర్కొనే సత్తా మా సైన్యానికి ఉంది'' అని బిపిన్ రావత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
సిక్కిం సెక్టార్లోని సరిహద్దు ప్రాంతమైన డాంగ్లాంగ్లోకి ప్రవేశించిన భారత సైనిక దళాలు వెనక్కి మళ్లితేనే తాజా వివాదంపై చర్చకు అంగీకరిస్తామని చైనా స్పష్టం చేసింది. అర్థవంతమైన చర్చలకు ఇది తొలి నిబంధన అని లుకాంగ్ పేర్కొన్నారు.
డొక్లాంలోని జోంప్లిరి ప్రాంతంవైపుగా చైనా రోడ్డు నిర్మించడంపై భూటాన్ వ్యక్తం చేసిన ఆందోళనను కొట్టిపార వేశారు. ''మేము భూటాన్లో అడుగుపెట్టలేదు. చైనా భూభాగం నుంచే సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం'' అని కాంగ్ తెలిపారు. జొంపిలిరి ప్రాంతంపై తమకు సార్వభౌమాధికారాలున్నాయిన భూటాన్ వాదిస్తున్నా, కొన్నేళ్లుగా చైనానే ఆ ప్రాంతం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
డాంగ్లాంగ్ ప్రాంతంలో భారత బంకర్లను చైనా పేల్చేసిన ఘటనపై స్పందిస్తూ ''దాడికి ప్రతిదాడితో చైనా సైన్యం సముచితంగానే స్పందించింది. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఇది భాగం'' అని ఆయన పేర్కొనడం గమనార్హం.