చైనా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడింది. దాంతో కాలిపోతున్నట్లుగా వస్తున్న వాసనను పసిగట్టిన ప్రయాణికులు పైలట్‌కు సమాచారమందించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో దించాడు. దాంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. ‘చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానంలో ఈ ఘటన చేటుచేసుకుంది.విమానం సిడ్నీ నుంచి చైనాలోని షాంఘైకి బయలుదేరిన గంట తర్వాత పెద్దగా శబ్ధం వచ్చింది. అనంతరం కాలిపోతున్న వాసన రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దాంతో గాల్లో ఎగురుతున్న విమానం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో అంతా వణికిపోయారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్.. సిడ్నీలో సురక్షితంగా దించారు. విమానం ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడిందని.. ఇంకాసేపు విమానం గాల్లోనే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.