//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టండి ఇలా

Category : world national

సైబర్ మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని ఎంత చెప్పినా నిత్యం ఎక్కడ ఒక చోట ప్రజలు సైబర్ మోసగాళ్ళ చేతిలో మోసపోతూనే ఉన్నారు. నగదు లావాదేవీలను సులభతరంగా నిర్వహించటానికి ఉపయోగిస్తున్న ఆన్ లైన్ బాంకింగ్ ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో సులభంగా చిక్కుకుంటున్నారు. ఈ నేరగాళ్ల వలలో చిక్కు కుంటున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.

తమ ఖాతా కు సంభందించిన వివరాలను ఎవరికీ చెప్పవొద్దు అని బాంకింగ్ అధికారులు సూచిస్తున్నప్పటికీ ఖాతాదారులను ఏదోవిధంగా బురుడి కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు తమ నేరాలను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు.వీరి బారిన పడకుండా ఖాతాదారులు తమ క్రెడిట్,డెబిట్ కార్డులకు సంభందించిన పాస్ వర్డ్ ను 40 రోజుల నుంచి 90 రోజుల లోపు మార్చాలని,డిఇని రహస్యం గా ఉంచాలని సైబర్ రంగ నిపుణులు,పోలీసు అధికారులు సూచిస్తున్నారు.ఈ నేరగాళ్ల బారిన పది నష్ట పోయిన వారి నుంచి పోలీసులకు ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ( యూపీఐ) నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చిన ఈ సౌకర్యం ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారింది. యూపీఐ గుర్తింపును, రహస్య సాంకేతిక సంఖ్య (ఎంపిన్)ను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.‘మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీ కార్డు వివరాలు చెప్పండి’ అంటూ వచ్చే ఫోన్లు మోసం అంటూ ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రోజుకు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలబారిన పడి, ఖాతాల్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్న వారు ఉంటూనే ఉంటారు. అవగాహన పెరగడం, సాంకేతికంగా కొత్త మార్పులు రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్న వారి వివరాలను తెలుసుకొని, వారి ఖాతాల్లో నుంచి లక్షల్లో బదిలీ చేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) యాప్ వినియోగిస్తున్న వారందరూ భవిష్యత్తులో సైబర్ నేరస్థులకు లక్ష్యాలేనని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఆన్లైన్, మొబైల్ వ్యాలెట్ల ద్వారా వస్తువులు కొన్నా, నగదు బదిలీ చేసినా.. ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) మొబైలుకు వచ్చేది. ఈ ఓటీపీ కాలపరిమితి 15 నిమిషాలు మాత్రమే ఉండేది. ఈ వ్యవధిలో లావాదేవీ పూర్తి కాకపోతే అది దానంతట అదే రద్దయ్యేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక మొబైల్ వ్యాలెట్లలో ఒకసారి లావాదేవీ పరిమితి రూ.లక్ష వరకూ పెరిగింది.ఓటీపీ అవసరం కూడా లేకుండా పోయింది. ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబరు ఉన్న ఫోనులో యూపీఐ ఆధారిత యాప్లు డౌన్లోడ్ చేసుకొని, వర్చువల్ ఐడీ, దానికో నాలుగు అంకెల పిన్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇక దాని నుంచే అన్ని లావాదేవీలూ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ తెలుసుకోవడం, ఖాతా వివరాలు, నగదు స్వీకరించడం, బదిలీ చేయడం ఇలా అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు.

ఈ పిన్ గతంలోలాగా 15 నిమిషాలు కాకుండా.. మనంతట మనం మార్చుకునేంత వరకూ అదే కొనసాగుతుంది. సైబర్ నేరస్థులు దీన్నే అవ కాశంగా మార్చుకుంటున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఒకసారి, మొబైల్ వ్యాలెట్ వినియోగదారుల కేంద్రం నుంచి అంటూ మరోసారి ఫోన్లు చేస్తుంటారు. వారు అడిగిన వివరాలు చెప్పడం, పంపిన వెబ్లింకులను తెరవడం లేదా, అందులో నాలుగంకెల రహస్య సంఖ్యను నమోదు చేయడం ఇలా వారి మాటల మాయలో పడి, వారు చెప్పిందల్లా చేసేస్తే..మన ఖాతాలో నగదు వారి జేబులోకి వెళ్లిపోతుంది.డెబిట్కార్డుల నుంచి రూ.వేలు, లక్షలు నగదు బదిలీ చేసుకునే నేరగాళ్లు బ్యాంకులకు పొరుగు సేవలనందించే సిబ్బందిని ప్రలోభపెట్టి, ఆయా బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదార్లకు ఫోన్లు చేసేందుకు వందల సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుంటారు. డెబిట్/క్రెడిట్ కార్డుదారులకు ఫోన్ చేసి, పేరు.. కార్డులోని మొదటి నాలుగో, చివరి నాలుగు అంకెలో చెప్పేస్తారు. ఇవి నిజమే అవడంతో అనుమానం రాదు.

వివరాలు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో, ప్రధానమంత్రి బీమా యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలకు ఇబ్బంది వస్తుందని బెదిరిస్తుంటారు. చదువుకున్నవారు, సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారు మాత్రం వీరి నుంచి తప్పించుకుంటుండగా.. విద్యార్థులు, యువతులు, మహిళలు, పదవీ విరమణ చేసిన వారు మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు పలు రక్షణ చర్యలు తీసుకున్నా.. రోజుకో కొత్త తరహా మాయలతో మోసగాళ్లు పలువురి కష్టార్జితాన్ని కొల్లగొడుతూనే ఉన్నారు. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్ వర్డ్ మార్చుకోండి.. ఎవరు కాల్ చేసి వివరాలు అడిగినా గోప్యత పాటించండి. ఏదైనా చిన్న అనుమానం కలిగినా సంబంధిత బ్యాంకును సంప్రదించండి. బ్యాంకు అధికారుల సూచనలను పాటించండి. సైబర్ నిపుణుల సలహాలను కూడా తీసుకుని మీ డబ్బును కాపాడుకోండి. అందుకే ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ చేసే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు .