ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. యుక్త వయసులో ఉన్నప్పుడే రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్న వ్యక్తి. అలా సాధారణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన చంద్రబాబు నాయుడు కొత్త వారికి అవకాశాలను కల్పించడంలో, వారికి నిత్యం తోడ్పాటు అందించడంలో ముందుంటారు. యుక్త వయసులో తాను ఎదుర్కొన్న బాధలను, కష్టాలను ఎప్పటికప్పుడు యువతతో పంచుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఏపీ రాజకీయ నేతల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట మంత్రివర్గ విస్తరణ. ఇదివరకులా కాకుండా, ప్రస్తుతం ఆ మాటను నిజం చేసే పనిలో పడ్డారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అది కూడా ఈ దసరా రోజునే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంద్న సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా, ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు దసరా రోజునాడే మంత్రివర్గ విస్తరణ చేపడితే అందులో ఓ ఇద్దరు చోటు దక్కించుకోనున్నారట. వారిలో ఒకరు 25 ఏళ్ల కుర్రోడు కాగా, మరొకరు రాయలసీమకు చెందిన వ్యక్తి ఉండబోతున్నారని సమాచారం.
అయితే, ఇటీవల కాలంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును మావోయిస్టులు అతి దారుణంగా తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక, ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు హత్యకు గురైన సర్వేశ్వరరావు, సోముల కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి.. తాను అమరావతి రాగానే కలుస్తానని చెప్పారు.
అందులో భాగంగానే, ఇటీవల దివంగత ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌ను సీఎం చంద్రబాబు అమరావతిలోని సీఎం కార్యాలయానికి పిలిపించి మాట్లాడారట. తన తండ్రి కిడారి మృతితో శ్రవణ్ బాధ పడుతుండగా చంద్రబాబు ఓదార్చారు. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ సమయంలోనే, ఐఐటీ చదివిన శ్రవణ్‌కు మంత్రివర్గ విస్తరణ సమయంలో చోటు కల్పించేందుకు పార్టీ సీనియర్ నేతలతో చర్చించారట సీఎం చంద్రబాబు. అలాగే, మైనార్టీ వర్గం నుంచి శాసన మండలి చైర్మన్ ఎండీ ఫరూక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చంద్రబాబు అభిప్రాయపడినట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.