//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దళిత్ నేత, పేదల పక్షపాతి రామ్‌నాథ్ కోవింద్‌‌

Category : national

రాష్ట్రపతి అభ్యర్థిగా  ఎన్డీయే ప్రకటించిన 72 ఏళ్ల రామ్‌నాథ్ కోవింద్‌‌కు దళిత నేతగా, పేదల పక్షపాతిగా మంచి పేరుంది. ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా ఆయన సేవలందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన కోవింద్ వృత్తిరీత్యా న్యాయవాది. హిందూత్వ భావజాలం మెండు. దళిత కోలీ కమ్యూనిటీకి చెందిన ఆయన ఉత్తరప్రదేశ్, బీహార్‌లో విస్తృత సేవలందించారు. 

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా,  (1998-2002), ఆల్ ఇండియా కోలీ సమాజ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన కోవింద్‌ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ నుంచి ఎందరో నేతలను తయారు చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి ప్రత్యామ్నాయంగా ఆయనను ప్రాజెక్ట్ చేసేందుకు కూడా బీజేపీ ప్రయత్నించింది. 2015 ఆగస్టు 8న ఆయన బీహార్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు.

 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 1994 నుంచి 2000, 2000-2006 వరకూ రాజ్యసభ సభ్యుడిగా కోవింద్ ప్రాతినిధ్యం వహించారు. లక్నోలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ మేనెజిమెంట్ సభ్యుడిగా, కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. 

నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా కోవింద్ బలంగా సమర్థించారు. సమాజంలో నల్లధనం నిర్మూలనకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడుతుందని బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో విస్పష్టంగా చెప్పారాయన. 

వృత్తిరీత్యా లాయర్ అయిన కోవింద్ 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టు అడ్వకేట్-ఆన్-రికార్డ్‌ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో 1993 వరకూ ఆయన ప్రాక్టీస్ చేశారు. 2002 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్)లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.

కాన్పూర్  కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించిన  అనంతరం ఐఏఎస్‌ కావాలనే సంకల్పంతో దిల్లీ వెళ్లి పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. అయినా ఐఏఎస్‌లో చేరకుండా  న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. బిజెపి లో  చేరకముందు మొరార్జీ దేశాయ్‌ వద్ద ప్రైవేట్‌ కార్యదర్శిగా పనిచేశారు.