దేశీయ కార్పొరేట్ కంపెనీల్లో సీఈవో, సగటు సిబ్బందిలకు చెల్లించే వేతనాల మధ్య భారీ వ్యత్యాసముందని ఓ అధ్యయనంలో తేలింది. బ్లూచిప్ కంపెనీలు తమవద్ద పనిచేసే సగటు ఉద్యోగితో పోలిస్తే సీఈవోకు గరిష్ఠంగా 1,200 రెట్లు అధిక జీతం చెల్లిస్తున్నాయి. గతసారి చాలామంది టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు గణనీయంగా పెరిగాయి. సగటు ఉద్యోగి అందుకునే జీతం మాత్రం గతస్థాయిలోనే ఉండటం లేదా మరింత తగ్గడం జరిగిందని అధ్యయనంలో తేలింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పీఎస్‌యూ చీఫ్‌లు సగటు ఉద్యోగి కంటే 3-4 రెట్లు అధిక జీతం అందుకుంటున్నారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించే జీతాలపై ఆంక్షలేమీ లేవు. కాకపోతే, సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు తమ సర్వోన్నతాధికారులకు ఎంతెంత జీతాలు చెల్లిస్తున్నారన్న విషయాన్ని మాత్రం బహిర్గతపర్చాల్సి ఉంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చాలా ఏళ్లుగా తన వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చెల్లింపుల ప్రకారంగా చూస్తే రిలయన్స్‌లో సగటు ఉద్యోగి జీతంతో పోలిస్తే ముకేశ్ ప్యాకేజీ 205 రెట్లు అధికంగా ఉంది.
విప్రోలో టాప్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ 260 నుంచి 259 రెట్లకు తగ్గగా, రెడ్డీస్ ల్యాబ్‌లో 312 నుంచి 233 రెట్లకు జారుకుంది. హీరోమోటోకార్ప్లో 755 నుంచి 731 రెట్లకు పడిపోయింది. టీసీఎస్‌లో సీఈవో జీతం సగటు సిబ్బందితో పోలిస్తే 460 నుంచి 515 రెట్లకు పెరిగింది. లుపిన్ చైర్మన్ ప్యాకేజీ 1,317 నుంచి 1,263 రెట్లకు తగ్గగా, సీఈవో పారితోషికం 217 రెట్లుగా ఉంది. అదానీ పోర్ట్స్ చైర్మన్ గౌతమ్ అదానీ జీతం 48 నుంచి 42 రెట్లకు తగ్గింది. బజాజ్ ఆటోలో టాప్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ 522 రెట్లుగా ఉంది.
ప్రధాన బ్యాంకుల విషయానికొస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో ఆదిత్య పురి పారితోషికం సాధారణ ఉద్యోగితో పోలిస్తే 179 రెట్ల నుంచి 187 రెట్లకు పెరిగింది. కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో 42 నుంచి 48 రెట్లకు పుంజుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 100 నుంచి 112 రెట్లకు పెరగగా, యాక్సిస్ బ్యాంక్‌లో 72 నుంచి 78 రెట్లకు ఎగబాకింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సీఈవో కేకి మిస్త్రీ వేతనం 88 నుంచి 92 రెట్లకు పెరుగగా, చైర్మన్ దీపక్ పరేఖ్ జీతం మాత్రం కేవలం 17 రెట్లుగా ఉంది.
లార్సెన్ అండ్ టుబ్రో చీఫ్ ప్యాకేజీ 1004 రెట్లుగా ఉంది. సిగరెట్ల తయారీ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ వేతనం 427 నుంచి 508 రెట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్‌లో 366 రెట్లకు పెరుగగా, సిప్లాలో 416 రెట్లు, మహీంద్రా అండ్ మహీంద్రాలో 108 రెట్లు, టాటా స్టీల్‌లో 94 రెట్లు, హెచ్‌యూఎల్‌లో 138 రెట్లుగా ఉంది.