//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓబీసీల ఉపవర్గీకరణ చేపట్టాలని కేంద్రం నిర్ణయం

Category : national

కేంద్ర జాబితాలోని ఓబీసీల ఉపవర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కమీషన్ వేయాలని తీర్మానించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఛైర్‌పర్సన్‌ను నియమించిన నాటి నుంచి 12 వారాల్లోపు ఈ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

ఈ కమీషన్ కేవలం ఓబీసీల ఉపవర్గీకరణ పరిశీలనకు మాత్రమే పరిమితమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయస్థాయిలో ఓబీసీ కేటగిరీలో క్రీమీలేయర్‌ గరిష్ఠ వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ కూడా కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఓబీసీ కేటగిరీలో ఏటా రూ.8 లక్షలదాకా ఆర్జించేవారు సైతం ఇప్పుడిక రిజర్వేషన్ల ప్రయోజనాల్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ పరిమితిని పెంచనున్నారు.

ఓబీసీలను వర్గీకరించాలన్న నిర్ణయంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, థావర్‌చంద్‌ గెహ్లోత్‌ వెల్లడించారు. ఇప్పటి వరకూ రిజర్వేషన్‌ ఫలాలు దక్కనివారికి కూడా వాటిని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఓబీసీలను వర్గీకరించాలని 1992లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లు గెహ్లోత్‌ గుర్తు చేశారు. బీసీలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులుగా వర్గీకరించడానికి న్యాయపరమైన ప్రతిబంధకాలేమీ లేవని 1992 నవంబర్‌ 16న సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పిందనీ, ఒకవేళ ఏదైనా రాష్ట్రం బీసీలను వర్గీకరించాలనుకుంటే చట్టపరిధిలో అదేమీ అసాధ్యం కాదని కూడా అభిప్రాయపడిందని వెల్లడించారు.