ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు ప్రణయ్‌రాయ్ నివాసంలో సీబీఐ నేడు సోదాలు నిర్వహించింది. ఓ ప్రయివేటు బ్యాంకుకు డబ్బు చెల్లించకుండా నష్టం కలిగించారన్న ఆరోపణలతో... ప్రణయ్ రాయ్‌తోపాటు ఆయన భార్య రాధికా రాయ్ సహా మరికొంత మందిపై కేసునమోదైంది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.48 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడం వల్లే వీరిపై కేసునమోదైనట్టు చెబుతున్నారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్నదాని ప్రకారం ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ప్రణయ్ రాయ్ రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఢిల్లీ, డెహ్రాడూన్ సహా నాలుగు చోట్ల సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది.
మరోవైపు తమ గొంతునొక్కేందుకే సీబీఐ, పలు దర్యాప్తు సంస్థలు వేధింపులకు దిగుతున్నాయని ఎన్డీటీవి ఆరోపించింది. సీబీఐ సోదాలు జరిగిన వెంటనే స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలను ఆధారం చేసుకుని గతంలో మాదిరిగానే మళ్లీ ఎన్డీటీవీపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించింది. దీనిపై ఎన్డీటీవీ, ప్రమోటర్లు అలుపెరుగని న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని పేర్కొంది.
"దేశంలో వ్యవస్థలను విధ్వసం చేయడం కోసం ప్రయత్నిస్తున్న వారికి మా సందేశం ఒక్కటి .. మేము మన దేశం కోసం పోరాడతాము.. ఈ శక్తుల దాడుల నుండి అధిగమిస్తాము" అని స్పష్టం చేశారు.