పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలవైపు ప్రజలు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 23శాతం మేర డిజిటల్ లావాదేవీలు పెరగ్గా, అందులో కేవలం 7శాతం మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగాయని ప్రభుత్వ అధికారులు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలిపారు.
‘పెద్దనోట్ల రద్దు డిజిటల్ ఎకానమీకి మారిన తీరు’పై పలు మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంటరీ స్థాయి సంఘానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. 2016 నవంబర్ నుంచి మే 2017 వరకూ వివిధ పద్ధతుల్లో 23 శాతం మేర డిజిటల్ లావాదేవీలు పెరగడం ద్వారా 27.5 మిలియన్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారట.అత్యధిక మంది యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా ఈ లావాదేవీలు జరిపారు. నవంబర్ 2016లో 10 లక్షలమంది వినియోగించగా, మే 2017 నాటికి ఈ సంఖ్య 30 లక్షలకు చేరింది.
ఇక ఇదే సమయంలో ఐఎంపీఎస్(తక్షణ పేమెంట్ సర్వీస్) ద్వారా ఈ సంఖ్య 1.2 మిలియన్ నుంచి 2.2 మిలియన్‌కు పెరిగింది. ఇక అతి తక్కువగా డిజిటల్ లావాదేవీలు జరిగిన విభాగం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానేనని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో 6.8మిలియన్ల మంది కార్డులను వినియోగించగా, ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 7.3 మిలియన్లుగా మాత్రమే ఉంది.