ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్ధ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో అమ్మకానికి రంగం సిద్ధం అయిన్నట్లు అయింది. ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఎయిరిండియాలో ఎంత వాటాను విక్రయించాలి, ఎయిరిండియా ఆస్తులు, అప్పులు ఎంత ఉన్నాయి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవలసి ఉందని జైట్లీ తెలిపారు.
ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ఎప్పటిలోగా జరిగేదీ తెలిపేందుకు జైట్లీ నిరాకరిస్తూ కేంద్ర మంత్రివర్గం తుది ఆమోదానికై ఒక ప్రతిపాదనను పంపుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ బృందంలోని సభ్యులతో త్వరలోనే సమావేశమవుతారని జైట్లీ చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాలను విక్రయించేందుకు నీతి అయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
దానిని నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పగించిన తరువాత కూడా ప్రభుత్వం అందులో భాగస్వామిగా కొనసాగడంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టంగా ఉందన్నారు. ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరుతో జెఆర్డి టాటా ప్రారంభించారు. 1946లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారి ఆ తరువాత 1953లో జాతీయకరణ చేయబడింది. ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలని 2000 సంవత్సరంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా ప్రతిపాదించింది.
ఎయిరిండియాలో 51 శాతం వాటాలను, 60 శాతం షేర్లను విక్రయించాలని అప్పటిలోనే నిర్ణయించింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిరసన తెలపడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ప్రైవేటీకరణ చర్చలు తిరిగి ఈ ఏడాది తొలి నాళ్ళలో ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్ధల నుంచి ఎయిరిండియా తీసుకున్న రూ.50 వేల కోట్లకు పైగా రుణాలను భరించే స్థితిలో లేమని ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది.