అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి పేరు మరోమారు మార్మోగనుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ బౌద్ధ విశేషాల ప్రదర్శనలో ‘అమరావతి, ఆంధ్రదేశం’ అంశాలపై ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ (మెట్) ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తికావడాన్ని పురస్కరించుకుని ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
2020లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శన కోసం ప్రపంచంలోని ప్రసిద్ధ మ్యూజియాలలో ఉన్న అమరావతి, ఆంధ్ర దేశపు బౌద్ధ విశేషాలను సేకరించే పని చురుగ్గా సాగుతోంది. ఒకనాడు బౌద్ధమతాన్ని అక్కునజేర్చుకుని ఆదరించిన ఆంధ్రదేశపు చారిత్రక విశేషాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజియాల నుంచి సేకరిస్తున్నారు.
ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన విలువైన ఈ వస్తువులను అత్యంత భద్రంగా సేకరించి న్యూయార్క్ తరలిస్తున్నామని, ప్రదర్శనల అనంతరం అంతే సురక్షితంగా వాటిని వాటి స్థానాలకు తిరిగి పంపుతామని మెట్ సౌత్, సౌత్ఈస్ట్ ఏషియన్ ఆర్ట్ క్యూరేటర్ జాన్‌గయ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు టెలిఫోన్ ద్వారా ఆయన ఈ వివరాలు అందించారు. న్యూయార్క్‌తో పాటు ఐరోపా దేశాలలో జరగబోయే అంతర్జాతీయ బౌద్ధ విశేషాల ప్రదర్శనలో ‘అమరావతి’, ‘ఆంధ్రదేశం’ అంశాలపై ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయడానికి జాన్‌గయ్ ఇటీవల ఏపీకి వచ్చి ప్రభుత్వ ముఖ్యులను కలిసి చర్చించి వెళ్లారు.
నవంబరులో మరోమారు అమరావతి సందర్శించి ముఖ్యమంత్రి సహా, ప్రముఖులకు ప్రదర్శనకు రావాల్సిందిగా ఆహ్వానాలు అందిస్తామని జాన్‌గయ్ తెలిపారు. అమరావతి, ఆంధ్రదేశపు బౌద్ధ విశేషాలను ఒక్క ఏపీ నుంచే కాకుండా లండన్, చెన్నయ్, కలకత్తా, ముంబయ్, న్యూఢిల్లీలోని ప్రసిద్ధ మ్యూజియాల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రదర్శనలతో ఆంధ్రదేశానికి మరోమారు అంతర్జాతీయ ఖ్యాతి రానున్నదని భావిస్తున్నారు. కొత్త రాజధాని నగరం అమరావతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చి అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నగరంగా విలసిల్లుతుందని క్యూరేటర్ జాన్‌గయ్ అంటున్నారు. 9 మాసాల పాటు జరగనున్న ఈ ప్రదర్శన మొదట న్యూయార్క్ నగరంలో జరగనున్నదని, ఐరోపాలో ఎక్కడ నిర్వహించేది త్వరలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
ఇక్కడి బౌద్ధ విశేషాలను అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఉంచేందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో మెట్ ఒక అవగాహన కుదుర్చుకుంటోంది. ఈ అవగాహన ప్రకారం చారిత్రక విశేషాలు, పురాతన శాసనాలు, ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు, ఉద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఈ శిక్షణ ఇస్తుంది.