అక్రమాస్తులు కూడబెట్టినట్లు పనామా పేపర్స్ లీకేజ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు పదవీ గండం ఏర్పడిన్నట్లే అని ఆ దేశంలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు ఆయన వారసత్వం ఎవ్వరికీ దక్కుతుందని పాకిస్థాన్ మీడియా లో చర్చలు జరుగుతున్నాయి.
షరీఫ్ తన పదవిని వదులుకోవాల్సి వస్తే, ఆయన స్థానంలో ఆయన సోదరుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహ్బజ్ షరీఫ్‌ను ప్రధానిగా చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఆయన జాతీయ అసెంబ్లీ, పార్లమెంటులో సభ్యుడు కాకపోవడంతో వెంటనే ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉండకపోవచ్చు.షెహబజ్ కోసం ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఖవజా అసిఫ్ 45 రోజుల పాటు మధ్యంతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
మనీలాండరింగ్, అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ గురించి చర్చించేందుకు శుక్రవారం షరీఫ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రధాని ఎంపిక గురించి వస్తున్న వార్తలను రక్షణశాఖ మంత్రి అసిఫ్ తోసిపుచ్చారు. ‘తమ పార్టీ అంతా నవాజ్ షరీఫ్ వైపే ఉంది, వేరే వాళ్లు ప్రధాని అభ్యర్థిగా అయ్యే అవకాశమే లేదు’ అని అసిఫ్ అన్నారు.కాగా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పాక్ ప్రతిపక్ష పార్టీలు షరీఫ్‌ను డిమాండ్ చేయగా ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.