ఉగ్ర దేశాలు, ఉగ్ర సంస్థల చర్యలను ఖండిస్తూ ఇవాళ బ్రిక్స్ దేశాలు తీర్మానం చేశాయి. ఆ తీర్మాన్ని అన్ని దేశాలు సమర్థించాయి. దీంతో ఉగ్రవాదంపై పోరు చేస్తున్న భారత్కు దౌత్యపరమైన మద్దతు లభించింది. తాలిబన్, ఐసిస్, ఆల్ ఖయిదా, హక్కానీ, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఉగ్ర దాడులను బ్రిక్స్ దేశాలు తప్పుపట్టాయి.
చైనాలోని జామిన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సమావేశాల్లో ఈ తీర్మానం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు టీమర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, దక్షిణాప్రికా అధ్యక్షుడు జాకబ్ జుమోతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఉంటేనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సహకారం ఉండాలని, అప్పుడే పారదర్శకత, ప్రగతి సాధ్యమవుతుందని మోదీ అన్నారు.
"ప్రపంచం అనిశ్చితి వైపు అడుగులేస్తున్న ఈ నేపథ్యంలో.. మన బలమైన సహకార వ్యవస్థ మనల్ని స్థిరత్వం, అభివృద్ధి వైపునకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తోంది. మన సహకారానికి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ పునాది. నేడు మన ప్రయత్నాలు టెక్నాలజీ, సంప్రదాయం, సంస్కృతి, వ్యవసాయం, పర్యావరణం వంటి విభిన్న అంశాలను తాకాయి. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నైపుణ్యాల పెంపు, విద్య, ఆహార భద్రత, లింగ సమానత్వం కోసం పాటుపడటం ద్వారా పేదరిక నిర్మూలనకు ‘బ్రిక్స్’ కృషి చేస్తోంది" అని భారత ప్రధాని పేర్కొన్నారు.