Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నారా కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రచారంలోకి..

Category : state politics

తెలుగుదేశంలో స్టార్ క్యాంపెయినర్లకు కొదువే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ, వంటి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నారా కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రచారంలోకి దిగారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. తన భర్త లోకేశ్‌ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని చెప్పారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంత అభివృద్ధి చేస్తే.. మంగళగిరి నుంచి ఎన్నికైతే ఇంకెంత చేస్తారో ఆలోచించాలని ప్రజల్ని కోరారు. రాబోయే ఐదేళ్లలో మరిన్ని సంస్థలు తీసుకొస్తామని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు లోకేశ్‌ ప్రత్యేక మేనిఫెస్టోని ప్రకటించారని తెలిపారు. స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని దాన్ని రూపొందించారని వివరించారు.

తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు బ్రాహ్మణి. మైనార్టీల స్వయం ఉపాధికి రుణాలు ఇస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోనే ఇల్లు, ఓటు హక్కు ఉన్నాయని చెప్పారు. సమస్యలు చెప్పుకొనేందుకు కుప్పం ప్రజల్లాగే.. మంగళగిరి ప్రజలకూ తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్న లోకేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు బ్రాహ్మణి. బ్రాహ్మణి ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఓ వృద్ధురాలు ఆమెకు 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ వృద్ధురాలికి బ్రాహ్మణి కృతజ్ఞతలు తెలిపారు.

Related News