Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళీ టీడీపీ దే అధికారం..ఎవరు చెప్పారంటే ?

Category : state politics

రాజకీయాల్లోకి రాకమునుపే ప్రజా సేవకు తనవంతు కృషి చేశా, ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నా, ఇక నా జీవితం స్వచ్ఛంద ప్రజా సేవకే అంకితమని మాజీ మంత్రి డాక్టర్‌ పరసా రత్నం స్పష్టం చేశారు. నాయుడుపేటలోని పరసా రత్నం నివాసంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లలో సూళ్లూరుపేటను ఎంతో అభివృద్ధి చేశానని, అధికారం ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నానని, ఇకపై కూడా ప్రజల నడుమే ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేగా లేకపోయినా 2018 జనవరి నుంచి 164 రాత్రులు ప్రజల నడమ గ్రామాల్లో నిద్రించి పలు సమస్యలు తెలుసుకుని పరిష్కరించానన్నారు.

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబునాయుడు రాజకీయ భిక్ష పెట్టి సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యేగా 6 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు. అందుకు చంద్రబాబుకు, టీడీపీకి రుణపడి ఉంటానన్నారు. మూడుసార్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా, ఒక సారి రాష్ట్ర మంత్రిగా పని చేసి తెలుగుదేశం ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర సాంకేతిక కళాశాలలను ఏర్పాటు చేసే భాగ్యం కలిగిందన్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇంతటి అవకాశం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు జన్మజన్మలకు రుణపడి ఉంటానని, వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. కుటంబంతో సమానంగా ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చి పనులు చేసే పరసాగానే మిగిలిపోతానని, ఎల్లవేళలా ప్రజల నడుమే గడుపుతామన్నారు.

ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశంపార్టీ తరుపున బరిలో ఉన్న తనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎనలేని సహాయ సహకారాలు అందించారన్నారు. గెలుపు, ఓటములు దైవనిర్ణయమని, దానికి కట్టుబడి ఉంటానన్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర విభజనతో 16వేల కోట్ల తీవ్ర లోటుబడ్జెట్‌ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ దక్షితతో చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చారన్నారు. దాంతోనే చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి నెలవల సుబ్రహ్మణ్యం, నుడా డైరెక్టర్‌ గూడూరు రఘునాథరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శిరసంనబేటి విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ వాణిజ్య రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, న్యాయవాది పసల గంగాప్రసాద్‌, అవధానం సుధీర్‌, భావన్‌, దార్ల రాజేంద్ర, పలుకు ముత్యాలయ్య, మైలారి నాగభూషణం, బల్లి మధు, ప్రవీణ్‌, దార్ల మోహన్‌, చిన్నయ్య, రాజు, వెంకటరాజా పాల్గొన్నారు.

Related News