//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో ఎవరు గెలిచినా..? కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ..!

Category : state politics

లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు శిస్ర్టా సంస్థ డీపీఆర్‌ను అందచేసిన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించటానికి రూ.20 వేలకోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా! ఈ నేపథ్యంలో, లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులను దశల వారీగా చేపట్టాలన్నది అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) భావనగా ఉంది. ఈ క్రమంలో ప్రధాన కారిడార్‌ ఎయిర్‌పోర్టు- ఏలూరు రోడ్డు -రైల్వేస్టేషన్‌- బస్‌స్టేషన్‌ -లింగాయపాలెం కారిడార్‌ నిడివి దాదాపుగా 55 కిలోమీటర్ల వరకు ఉంది. ఇంత భారీ పొడవైన కారిడార్‌ను ఒకే దశలో కాకుండా రెండు దశలుగా నిర్మించాలన్నది ఏఎంఆర్‌సీ ఆలోచనగా ఉంది. దీనిపై కొద్ది రోజుల కిందట స్టీరింగ్‌ కమిటీ లో ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉండటం, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో స్టీరింగ్‌ కమిటీని అర్థంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, నూతన ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి అమరావతి నుంచి తీసుకోవాలా? విజయవాడ నుంచి తీసుకోవాలా? అన్న అంశంపై ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి రావటంతో పాటు ఏ విధానంలో తీసుకు వెళ్ళాలన్న దానిపై కూడా నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడకు మెట్రో రైల్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డీఎంఆర్‌సీని ప్రభుత్వ సలహా సంస్థగా ఎంపిక చేయటం జరిగింది. ప్రభుత్వం దీనిపై ఫెసిబిలిటీ చేయించగా.. మొదటి దశలో విజయవాడ- గుంటూరు ప్రాంతాలు అనువైనవిగా గుర్తించింది. విజయవాడలో మొదటి దశలో, గుంటూరులో రెండవ దశలో మెట్రో పనులు చేపట్టవచ్చని ప్రస్తావిస్తూ మీడియం కేటగిరీ మెట్రోను ప్రతిపాదించింది. తొలిదశ లో విజయవాడలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్రం మౌఖికంగా ఆదేశాలు ఇవ్వటంతో టెండర్ల ప్రక్రియ వరకు వెళ్ళింది.కాంట్రాక్టు సంస్థలు అత్యధికంగా కోట్‌ చేయటంతో డీఎంఆర్‌సీ ఆ టెండర్లను రద్దు చేసింది.

AP New government Takes main decision On Light Metro Rail Project

ఇదే సందర్భంలో కేంద్రం నుంచి తుది అనుమతులు రాకపోవటం, నూతన మెట్రో పాలసీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పటం, ఈ క్రమంలో ప్రభుత్వం మీడియం మెట్రోస్థానంలో ప్రత్యామ్నాయం ఆలోచించి లైట్‌ మెట్రో వైపు వెళ్ళాలని నిర్ణయించింది. లైట్‌ మెట్రోవైపు మళ్లిన నేపథ్యంలో, మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో నూతన మెట్రో పాలసీ రావటం జరిగింది. నూతన మెట్రో పాలసీ ప్రకారం పీపీపీ విధానంలో చేపట్టాల్సి ఉంది. లైట్‌ మెట్రో కూడా మెట్రో కేటగిరీలోనిదే కాబట్టి ప్రభుత్వం డీపీఆర్‌కు శ్రీకారం చుట్టింది. డీపీఆర్‌ రానే వచ్చింది. విజయవాడ, అమరావతిలను అనుసంధానం చేస్తూ 70 కిలోమీటర్ల నిడివితో రూ.20 వేల కోట్ల వ్యయంతో నివేదిక ఇచ్చింది. ఇంత బడ్జెట్‌ను మోయాల్సి రావటం ఒక రకంగా ఇబ్బందికరమైన అంశం. ఈక్రమంలో దశల వారీగా ప్రాజెక్టు పనులను చేపట్టాల్సి ఉంది.

లైట్‌మెట్రోను కేంద్రంతో కాకుండా ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో వెళితే మాత్రం ఎటు నుంచి ఎటు అయినా ప్రారంభించవచ్చు. అయితే దీనికి ప్రాతిపదిక కూడా ఉండాలి. రాజధానిలో జనసమ్మర్ధం పెరగాలి. అప్పటి వరకు రాజధాని నుంచి లైట్‌ మెట్రో వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. లైట్‌ మెట్రో పూర్తి కావటానికి మూడు నాలుగేళ్ళ సమయం పడుతుంది కాబట్టి అప్పటికీ రాజధానిలో నిర్మాణాలు పూర్తి కావటం, జనసమ్మర్థం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తే అటు నుంచే శ్రీకారం చుట్టవచ్చు. ఇకపోతే విజయవాడ రవాణా పరంగా మంచి అనుకూలంగా ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టును, విజయవాడ నగరంలో ప్రధానమైన ఏలూరు, బందరు రోడ్లతో పాటు, లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లను టచ్‌ చేస్తూ రూపొందించిన కారిడార్లు కావటం చేత బ్రేక్‌ ఈవెన్స్‌, లాభాలు సాధించటానికి అవకాశం ఉంటుంది.లైట్‌ మెట్రో రైల్‌ విజయవాడ పార్ట్‌లో అయితే 34.5 కిలోమీటర్లు, అమరావతిలో అయితే 24 కిలోమీటర్ల మేర కారిడార్‌ నిడివి ఉంది.

విజయవాడలో అయితే ఎయిర్‌పోర్టు దగ్గర ఒకటి రెండు కిలోమీటర్ల మినహా మిగిలినదంతా ఎలివేటెడ్‌ విధానం(ఫ్లై ఓవర్‌ స్ట్రక్చర్‌)లో నిర్మించాల్సి ఉంటుంది. అదే అమరావతిలో అయితే అండర్‌ గ్రౌండ్‌ విధానంలో నిర్మించాల్సి ఉంది. విజయవాడలో కారిడార్‌ నిడివి ఎక్కువుగా ఉన్నా ఎలివేటెడ్‌ విధానం కాబట్టి ఖర్చు తక్కువుగా ఉంటుంది. అదే అమరావతిలో అయితే అండర్‌ గ్రౌండ్‌ కాబట్టి ఖర్చు ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి కొలువు తీరే నూతన ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉంటాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానికి మరో నెల రోజుల సమయం వేచి ఉండాల్సి ఉంది.