Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

1994 రిపీట్‌..ఘనవిజయం ఎవరిదో తెలుసా ?

Category : state politics

ఒంగోలు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ 1994లో టీడీపీకి లభించిన ప్రజాస్పందన ఇప్పుడు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటమే కాదు, జిల్లాలోని టీడీపీ అభ్యర్థులంతా ఘనవిజయం సాధిస్తారు. ఇది ఖాయం’ అని ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి, మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. కీలకమైన ప్రచారఘట్టం ముగిసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒంగోలులో ఆయన మాట్లాడారు. ఒంగోలు లోక్‌సభస్థానంలో తాను విజయకేతవనం ఎగురవేయడంతోపాటు రాష్ట్రంలోని 20కిపైగా లోక్‌సభ స్థానాలు, 125కుపైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతున్నదని ధీమాను వ్యక్తం చేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి వస్తున్న స్పందన అందుకు దర్పణం పడుతుందన్నారు.

టీడీపీ శ్రేణులు రావడం ముఖ్యం కాదని, గ్రామగ్రామానా సామాన్య ప్రజానీకం తరలివస్తున్నదని, దీన్ని చూసి నేను ఉప్పొంగిపోయానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభలకు పెద్దసంఖ్యలో మహిళలు తరలిరావడం మా గెలుపు ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూల పరిస్థితికి అది నిదర్శనమన్నారు. మార్కాపురం డివిజన్‌లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లినా ప్రజలు ముందుకు వచ్చి స్వాగతం పలికారని తెలిపారు. ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన ఆధిక్యం వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు దోహదపడి ఉండవచ్చని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

‘ఒకవైపు నేను, మరోవైపు నా కుటుంబసభ్యులు ఆ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాం. ఎక్కడకు వెళ్లినా ప్రజల నుంచి అపూర్వస్వాగతం లభించింది. అంతేకాక ప్రజలు తామంతట తాము మా దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు. పశ్చిమప్రాంతంలోనే మేము ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. 1994లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరగబోతుంది. ఇంకో ప్రశ్నకు బదులుగా మాగుంట మమ్మల్ని మోసం చేసి వెళ్లారు, ఆ విషయం మా పార్టీ శ్రేణులందరికీ అర్థమైంది. అందువలన మాపార్టీ వైపు నుంచి ఆయన ఓట్లు పొందలేరన్న ప్రచారంలో నిజం లేదు’ అని అన్నారు. నాకు తెలిసి వైసీపీలోనే అంతర్గత విభేదాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇంకోవైపు ‘మా కుటుంబం నిరంతర సేవా కార్యక్రమాలు చేయడం, నేను ప్రభుత్వపరంగా ఏ స్థాయిలో అభివృద్ధి సాధించగలనో దర్శిలో నిరూపించిన విషయాన్ని ప్రజలు గుర్తించిన విషయం మాకు కలిసివస్తుంది. అనేక ప్రాంతాల్లో మేము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మా ప్రాంతంలో కొనసాగించండి, మేమంతా మీ వెంట ఉంటాం అని ఆ ప్రాంత ప్రజలు ఉమ్మడిగా వచ్చి అభ్యర్థించారు. లోక్‌సభ పరిధిలోని అన్ని ప్రాంతాల వారికి సేవ చేస్తానని నమ్మకం కలిగించా. ఆ నమ్మకంతో వచ్చే ఓట్లు మాకు అదనపు బలం. గెలుపుపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. తప్పక విజయం సాధిస్తా’ అని ధీమా వ్యక్తం చేశారు.

Related News