ఇప్పటి వరకు స్టార్లంటే క్రికెటర్లే అన్నట్లు సాగుతుండగా ఇప్పుడు ఇండియన్ బ్యాడ్మింటన్ గోల్డెన్ బాయ్ కిదాంబి శ్రీకాంత్ కూడా బ్రాండ్ల హాట్ ప్రాపర్టీగా మారిపోయాడు. రెండు వరుస సూపర్‌సిరీస్ టైటిల్స్ గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచిన శ్రీకాంత్‌తో ఒప్పందం కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మూడు కంపెనీలు అతనితో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
గత ఆదివారం ఇండోనేషియా ఓపెన్, నిన్న ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన శ్రీకాంత్ ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో ఓ సెన్సేషన్. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌పై 22-20, 21-16తో గెలిచి సంచలనం సృష్టించాడు శ్రీకాంత్. దీంతో అతని పేరు మారుమోగిపోతుంది.
ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ ఈ దెబ్బతో టాప్ టెన్‌లోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. ఓ టాప్ టైర్ల కంపెనీ, ఎనర్జీ డ్రింక్స్ తయారుచేసే సంస్థ, డిజిటల్ కంపెనీలు శ్రీకాంత్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పటికే అతని ఏజెంట్లతో మాట్లాడారు. నాలుగేళ్లుగా సైనా నెహ్వాల్, పీవీ సింధు మాత్రమే క్రికెటర్లకు సమానంగా క్రేజ్ సంపాదించగా, తాజాగా శ్రీకాంత్ కూడా వారి సరసన చేరాడు.
శ్రీకాంత్‌తో ఒప్పందం ఉన్న ఏజెన్సీ బేస్‌లైన్ వెంచర్స్‌ను గత రెండు వారాల్లో పలు కంపెనీలు కలిసి చర్చించినట్లు సమాచారం. టైర్ల సంస్థ, ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ శ్రీకాంత్‌తో మూడేళ్ల ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇవి ఒక్కోటి రూ.3 కోట్ల విలువ కలిగినవి కావడం గమనార్హం. ఇక డిజిటల్ కంపెనీ ఒప్పందం విలువ రూ.2.4 కోట్లు ఉన్నట్లు తెలుస్తున్నది.