వారాంతంలో దేశీయ సూచీలు లాభాలతో కళకళలాడాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల అండతో కొత్త రికార్డులను సాధించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా ఇందుకు కలిసొచ్చాయి. మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో ఆరంభం నుంచి లాభాల జోరు సాగించిన సూచీలు శుక్రవారం సరికొత్త గరిష్ఠాలను చేరుకున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్.. ప్రతిష్ఠాత్మక 34వేల మైలురాయికి 60 పాయింట్ల దూరంలోనే ఉంది. ఇక నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని తాకింది. ఈ ఉదయం 70 పాయింట్లకు పైగా లాభంతో 33,830 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్.. రోజంతా ఆ జోరును కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది.
శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 184 పాయింట్లు ఎగబాకి 33,940 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 53 పాయింట్ల లాభంతో 10,493 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.64.04గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, హిందాల్కో, టీసీఎస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్, లుపిన్, కోల్ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టాటాస్టీల్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.