రంజాన్ సందర్భంగా షాపింగ్ చేస్తున్న సామాన్యులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులలో పాకిస్తాన్ దద్దరిల్లింది. పాకిస్తాన్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన ఒక ఆత్మాహుతి దాడి, రెండు బాంబు పేలుడు ఘటనలలో 42 మంది మృతి చెందగా, 121 మంది గాయపడ్డారు.
బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని ఖ్వెట్టా లోని ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఏషాన్ మెహబూబ్ కార్యాలయం సమీపంలో బాంబులతో నింపిన కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకోవడంతో ఏడుగురు పోలీస్ లతో సహా 13 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యత అని స్థానిక ఇస్లామిక్ స్టేట్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ (జేయుఎ) ప్రకటించుకున్నాయి.
కొన్ని గంటల తర్వాత కుర్రం గిరిజన షియాలు అత్యధికంగా గల పరాచినార్ ప్రాంతంలో తురి మార్కెట్ వద్ద తొలి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో గాయపడిన వారిని స్థానికులు రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా రెండో పేలుడు సంభవించింది.
రెండు ఘటనల్లో 25 మంది మరణించారని, మరో వంద మంది గాయపడ్డారన్నీ పరాచినర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సాబీర్ హుస్సేన్ తెలిపారు. ఈ బాంబు పేలుళ్లకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తామే బాధ్యులమని ప్రకటించుకో లేదు.