//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరిగి రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న బోఫర్స్ కుంభకోణం

Category : national

మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను పీడకలలా వెంటాడుతున్న బోఫోర్స్ కుంభకోణం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. నిందితులంతా కన్నుమూస్తున్నా,  అప్పట్లో కొనుగోలు చేసిన ఫిరంగులు ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాఈ కుంభకోణం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతున్నది.

ఇటీవలే బీజేపీ ఎంపీలు బోఫోర్స్ కుంభకోణంపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీజేడీ ఎంపీ భర్త్రుహరి మహతాబ్ బ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)ని ఏర్పాటు చేసింది. జులై ప్రారంభంలో పీఏసీ అధ్యక్షుడు మహతాబ్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేతో కూడిన కమిటీ సమావేశమైంది.

1989  ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటమి చెందడానికి దారితీసిన ఈ కుంభకోణం గురించిన విచారణను తిరగ తోడాలని ఈ కమిటీ నిర్ణయించడంతో తిరిగి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు ఉత్తరువు ద్వారా బిజెపి నాయకులు ఎల్ కె అద్వానీ, ఉమా భారతి తదితరులపై బాబ్రీ మసీద్ కేసును తిరిగి తెరిచిన విధంగా బోఫర్స్ కేసు విషయంలో కూడా అదే చేయవచ్చని ఈ సమావేశంలో బిజెపి యంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు.

బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు, సమాచారం గల్లంతయ్యాయని కాగ్ తన నివేదికలో పేర్కొన్నదని, ఆ పత్రాలను వెతికిపట్టుకొని తమకు అందజేయాలని రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ కమిటీ సూచించింది.

కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న బోఫోర్స్ కుంభకోణం వ్యవహారం ఈ కేసులో పెద్దవాళ్ల హస్తం ఉన్నదంటూ స్వీడిష్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ స్టెన్ లిండ్‌స్ట్రామ్ ఇటీవల పేర్కొనడంతో మళ్లీ రాజకీయ వేడిని సృష్టించింది. మరోవైపు అజయ్ అగర్వాల్ పిటిషన్‌పై త్వరలో సుప్రీంకోర్టు వాదోపవాదాలు విననుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

సిబిఐ డైరెక్టర్ అలోక్ కుమార్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై అప్పటి ప్రభుత్వం ఈ కేసును మూసివేయాలని అనుకున్నదని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ తలచు కొంటె తిరిగి కేసు దర్యాప్తును ప్రారంభించవచ్చని చెప్పారు. అయితే ఈ కేసును తిరిగి చేపట్టే అవసరం, అవకాశం గురించి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచవలసింది, తగు సిఫార్సు చేయవలసింది సిబిఐ మాత్రమే అని బిజెపి స్పష్టం చేస్తున్నది.